Site icon NTV Telugu

CSK vs MI: దిగ్గజ టీంల మధ్య మ్యాచ్.. టాస్‌ ఎవరు గెలిచారంటే?

Chennai Vs Mumbai

Chennai Vs Mumbai

CSK vs MI: ఇండియన్​ ప్రీమియర్ లీగ్​ 16 సీజన్‌లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ దిగ్గజ టీంలు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి​ జట్టు ముంబయికి బ్యాటింగ్​ అప్పగించింది. దిగ్గజ జట్లు ఆడుతున్న ఈ మ్యాచ్‌ కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్ ఈ సీజన్‌ను ఓటమితోనే ఆరంభించిన సంగతి తెలిసిందే. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ చేతిలో పరాజయంపాలైంది. అయితే, రెండో మ్యాచ్‌లో లక్నోను చిత్తు చేసినప్పటికీ.. తనదైన స్థాయిలో మాత్రం విజయం సాధించలేకపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసి 200కిపైగా పరుగులు చేసినా.. పోరాడి మరీ 12 పరుగుల తేడాతోనే గెలిచింది. బ్యాటింగ్‌లో రుతురాజ్‌, డేవన్‌ కాన్వే, ఎంఎస్ ధోనీ, మొయిన్‌ అలీ రాణిస్తున్నారు. బౌలింగ్‌లో మాత్రం ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన తుషార్‌ దేశ్‌ పాండే నిరాశపరిచాడు. ప్రత్యర్థిని కట్టడి చేసే క్రమంలో ఎక్స్‌ట్రాల రూపంలో భారీగా పరుగులు సమర్పించడం చెన్నై బౌలర్లకు రెండు మ్యాచుల్లోనూ అలవాటుగా మారిపోయింది. ఇక టాప్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పూర్తిస్థాయిలో ఇంకా విజృంభించడం లేదు. మరో స్టార్‌ బెన్‌స్టోక్స్ అయితే బ్యాటింగ్‌, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలం కావడం చెన్నై అభిమానులను నిరాశకు గురి చేసింది.

ఐదుసార్లు ఛాంపియన్‌ అయిన ముంబయి ఇండియన్స్‌ ఈ సారి తొలి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో చిత్తయింది. బ్యాటింగ్‌లో కాస్త ఫర్వాలేదనిపించిన ముంబయి.. బౌలింగ్‌లో మాత్రం డీలా పడింది. సీనియర్‌ బౌలర్ బుమ్రా లేకపోవడం ముంబయికి లోటు. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌, జోఫ్రా ఆర్చర్‌ ప్రభావం చూపలేకపోయారు. సీనియర్ పీయూష్ చావ్లా ఇంకా తనలో సత్తా ఉందని చాటి చెప్పడం విశేషం. ఆసీస్‌ ఆల్‌ రౌండర్ కామెరూన్ గ్రీన్ బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయాడు. చెన్నై, ముంబయి జట్లు ఆడిన 34 మ్యాచుల్లో తలపడగా.. ముంబయి 20 సార్లు, చెన్నై 14 మ్యాచుల్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

తుది జట్లు:
ముంబయి: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్‌ కిషన్ (వికెట్‌ కీపర్), సూర్యకుమార్‌ యాదవ్, కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్‌ డేవిడ్‌, హృతిక్ షోకీన్, పీయూశ్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌, అర్షద్‌ ఖాన్‌

చెన్నై: ఎంఎస్ ధోనీ (కెప్టెన్/వికెట్ కీపర్), డేవన్ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, బెన్‌ స్టోక్స్, రవీంద్ర జడేజా, శివమ్‌ దూబే, మిచెల్‌ సాంట్నర్, దీపక్ చాహర్, రాజ్‌వర్థన్ హంగార్గేకర్

Exit mobile version