NTV Telugu Site icon

IPL 2025: ఇది కదా ఐపీఎల్ క్రేజ్.. మ్యాచ్ టిక్కెట్ ఉంటే మెట్రో రైలు, ఎంటీసీ బస్సులలో ప్రయాణం ఉచితం

Ipl 2025

Ipl 2025

IPL 2025: ఐపీఎల్ అనేది కేవలం క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాకుండా.. కోట్లాది మంది అభిమానులకు ఉత్సాహాన్ని, వినోదాన్ని పంచే గొప్ప పండుగ అని చెప్పవచ్చు. ఈ సారి జరగబోయే ఐపీఎల్‌ 2025 సీజన్ ను మరింత సులభతరం చేసేందుకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL), చెన్నై మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (MTC) కలిసి కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ముఖ్యంగా, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) హోమ్ మ్యాచ్‌లకు హాజరయ్యే అభిమానుల కోసం ఈ ఉచిత మెట్రో రైలు, బస్సు సేవలను అందిస్తున్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్‌లకు టిక్కెట్ కలిగిన వారు మెట్రో రైలు సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చు. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL), చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, క్రికెట్ టిక్కెట్ కలిగిన ప్రేక్షకులు తమ సమీప మెట్రో స్టేషన్ నుండి గవర్నమెంట్ ఎస్టేట్ మెట్రో స్టేషన్ వరకు ప్రయాణించడానికి ఎలాంటి ఛార్జీలు చెల్లించనవసరం లేదు.

Read Also: Robinhood: స్టేజీపై విద్యార్థులతో రెచ్చిపోయిన నితిన్, శ్రీలీల.. వీడియో వైరల్

ఈ సేవలు మ్యాచ్ జరిగే రోజుల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత 90 నిమిషాల పాటు లేదా అర్థరాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లను అందుబాటులో ఉంచనున్నారు. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి, అవసరమైనప్పుడు మెట్రో రైలు చివరి సర్వీస్ సమయాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది. కేవలం మెట్రో రైలు మాత్రమే కాకుండా, చెన్నై మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (MTC) కూడా ఐపీఎల్ అభిమానుల కోసం ప్రత్యేక బస్సు సేవలను అందుబాటులోకి తెచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ ప్రకటన ప్రకారం, CSK హోమ్ మ్యాచ్‌కు హాజరయ్యే అభిమానులు తమ క్రికెట్ మ్యాచ్ టిక్కెట్‌ను చూపించి ఎంటీసీ నాన్-ఏసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ ఉచిత బస్సు సేవలు మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల ముందు నుంచే అందుబాటులో ఉంటాయి. గత ఏడాది చెన్నైలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లకు దాదాపు 8,000 మంది వరకు ఎంటీసీ బస్సుల సేవలను ఉపయోగించుకున్నారని విశ్వనాథన్ తెలిపారు.

Read Also: IPL Purple Cap Holders: బ్యాట్స్మెన్స్ దూకుడికి కళ్లెం వేసి ఐపీఎల్ చరిత్రలో ‘పర్పుల్ క్యాప్’ సాధించిన ఘనులు వీరే

ఈ విషయమై CSK టీం మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ.. మా అభిమానులకు ఉత్తమ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో మెట్రో, MTCతో ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలిపారు. చెన్నైలోని క్రికెట్ అభిమానులు తమ ఇళ్ల నుంచి బయలుదేరిన క్షణం నుండే ఐపీఎల్ ఉత్సాహాన్ని పూర్తిగా ఆస్వాదించగలిగేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రణాళిక వెనుక ప్రధాన లక్ష్యం అభిమానులను మెట్రో, బస్సుల వంటి ప్రజా రవాణా సేవలను ఉపయోగించేందుకు ప్రోత్సహించడం. ప్రజా రవాణా వాడకాన్ని పెంచడం ద్వారా ట్రాఫిక్ సమస్యను తగ్గించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఈ దెబ్బతో ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు మెట్రో, బస్సు సేవలు ఉచితంగా అందించడంతో వారు మరింత సులభంగా స్టేడియంకు చేరుకునే అవకాశం చేకూరనుంది/