Site icon NTV Telugu

MS Dhoni Case: 15 కోట్లు మోసం చేశాడంటూ.. ఎంఎస్ ధోనీపై ఛీటింగ్ కేసు నమోదు!

Ms Dhoni

Ms Dhoni

MS Dhoni 15 Crore Fraud Case: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఛీటింగ్ కేసు నమోదైంది. ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ నిర్వహణ విషయంలో ధోనీ తనను రూ.15 కోట్ల మేర మోసం చేశాడని ఉత్తరప్రదేశ్‌లోని అమేథికి చెందిన రాజేశ్ కుమార్ మౌర్య బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. బీసీసీఐ ఎథిక్స్ కమిటీ రూల్ 36 కింద కేసును నమోదు చేసుకొని.. ఆగస్ట్ 30లోపు వివరణ ఇవ్వాలని ధోనీని బీసీసీఐ ఆదేశించింది. ఈ విషయంపై ధోనీ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

2017లో ఎంఎస్ ధోనీ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీ నడిపేందుకు ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలోని షరతులను పాటించడంలో కంపెనీ విఫలమైంది. ఆర్కా స్పోర్ట్స్‌కు చెందిన మిహిర్‌ దివాకర్‌, సౌమ్య విశ్వాస్‌తో చర్చించినా ఫలితం లేకపోవడంతో ఆ ఒప్పందం నుంచి మహీ వైదొలిగాడు. 2021 ఆగస్టు 15న ఆర్కా స్పోర్ట్స్‌కు ఇచ్చిన అథారిటీ లెటర్‌ను రద్దు చేసుకున్నాడు. దాదాపు రూ. 15 కోట్ల మేర తనకు రావాలని పలుమార్లు లీగల్‌ నోటీసులు పంపించినా.. అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ధోనీ రాంచీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ కేసు విచారాణలో ఉంది.

Also Read: Siddhnath Temple: ఆలయంలో భారీ తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి!

తాజాగా 43 ఏళ్ల ఎంఎస్ ధోనీనే తమను మోసం చేశాడంటూ ఆర్కా స్పోర్ట్స్‌కు చెందిన రాజేశ్ కుమార్ బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. మిస్టర్ కూల్‌పై ఛీటింగ్ కేసు నమోదవ్వడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో ధోనీ ఆడుతాడా? లేదా? అన్న వేళ ఈ న్యూస్ మహీ అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది.

Exit mobile version