విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరమన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలన్నారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని, దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు. విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదని అన్నారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించాలని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు.
