NTV Telugu Site icon

Chandrababu: రామోజీరావు పార్థివదేహానికి చంద్రబాబు దంపతుల నివాళి

Chandrababu

Chandrababu

Chandrababu: రామోజీ ఫిల్మ్‌ సిటీలో రామోజీరావు పార్థివదేహానికి చంద్రబాబు దంపతులు నివాళులర్పించారు. రామోజీరావు కుటుంబ సభ్యులను వారు ఓదార్చారు. ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రామోజీరావు పార్థివదేహం వద్ద కొద్దిసేపు చంద్రబాబు మౌనం పాటించారు. నివాళుర్పించిన అనంతరం రామోజీ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ పరామర్శించారు. రామోజీరావు మరణం మీడియా, సినీ రంగానికి తీరని లోటని అన్నారు. మీడియా, చలనచిత్రాల రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: Ramoji Rao: బతికి ఉండగానే స్మారకం.. ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది చూద్దురు అనేవారు!

రామోజీ పార్థివదేహానికి నివాళి అర్పించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రామోజీరావు చివరి వరకూ సమాజ హితం కోసమే పని చేశారని ఆయన అన్నారు. ప్రజలను చైతన్య వంతులను చేయడానికి ఆయన అనుక్షణం పరితపించారని.. ‘రామోజీరావు ఓ వ్యక్తి కాదు.. ఆయన ఓ గొప్ప శక్తి అని చంద్రబాబు కొనియాడారు. ఈనాడు ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని, విజ్ఞానవంతుల్ని చేశారన్నారు. జర్నలిజానికి విశేష సేవలందించారని.. మొదటి నుంచి ప్రజల పక్షాన నిలబడతానని చెప్పిన గొప్ప వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. ఫిలింసిటీని నిర్మించి చిత్ర పరిశ్రమకు ఎనలేని సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు. రామోజీరావు ఇచ్చిన స్ఫూర్తితో తెలుగుజాతిని ముందుకు తీసుకెళ్తానని.. రామోజీ కుటుంబ సభ్యులు, ఉద్యోగులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.  రామోజీరావు అస్తమయంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు.. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మంచిని మంచిగా.. చెడును చెడుగా చెప్పే ఆయన తీరు.. తనను ఆయనకు దగ్గర చేసిందని అన్నారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీకి తరలించగా.. ఆయనకు నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు.