Site icon NTV Telugu

Chandrababu Naidu Arrest: చంద్రబాబుకు తెల్లవారుజామున 4 గంటలకు వైద్య పరీక్షలు.. మరికాసేపట్లో.. !

Chandrababu Naidu Arrest

Chandrababu Naidu Arrest

Chandrababu Naidu’s Medical Tests are completed Today: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు విచారణ ముగిసింది. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు సీఐడీ విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆదివారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో భారీ భద్రత మధ్య చంద్రబాబును విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి.. బీపీ, షుగర్, ఎక్స్‌రే, ఛాతి సంబంధిత పరీక్షలు నిర్వహించారు. మరికాసేపట్లో చంద్రబాబును సీఐడీ కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది.

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కాంలో ప్రధాన నిందితుడు అయిన నారా చంద్రబాబును సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) శనివారం నంద్యాలలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జర్మనీకి చెందిన ఓ కంపెనీలో నిబంధనలకు విరుద్ధంగా కోట్లు విడుదల చేయించి కొల్లగోట్టారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు సిట్‌ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు.. ఆదివారం తెల్లవారుజామున 3.00 గంటల వరకూ అక్కడే ఉన్నారు. దాదాపు10 గంటల పాటు సిట్‌ కార్యాలయంలోనే ఉన్న ఆయన బయటకు వచ్చే సమయంలో నీరసంగా కనిపించారు.

సిట్‌ కార్యాలయం నుంచి ఆసుపత్రికి నారా చంద్రబాబును తీసుకెళుతున్న వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని పక్కకు నెట్టివేశారు. ఆసుపత్రి వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. సమీపంలోకి టీడీపీ కార్యకర్తలు రాకుండా చర్యలు చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టుకు తీసుకెళ్లకుండా.. మళ్లీ సిట్‌ కార్యాలయానికే తీసుకువెళ్లారు. మరికాసేపట్లో చంద్రబాబును సీఐడీ కోర్టు జడ్జి ముందు అధికారులు ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్, లాయర్స్ కోర్టు వద్దకు చేరుకున్నారు.

Also Read: G20 Summit 2023: చైనా సిల్క్ రూట్ కట్.. ఇండియా నుంచి యూరప్ వరకు స్పైస్ రూట్

చంద్రబాబు అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఆయన తరఫున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ ఎలాంటి ప్రొసీజర్‌ను ఫాలో కాలేదని, ముందుగా నోటీసులు ఇవ్వలేదని జడ్జికి తెలిపారు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదన్నారు. అయితే ఆ పిటిషన్‌ను కోర్టు జడ్జి తిరస్కరించారు. రిమాండ్ రిపోర్ట్ లేకుండా.. హౌస్ మోషన్ పిటిషన్ ఎలా దాఖలు చేస్తారంటూ ప్రశ్నించారు. రిమాండ్ రిపోర్ట్ వచ్చాక పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు.

Exit mobile version