Chandrababu Election Campaign: ఓవైపు సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధమంటూ బస్సుయాత్రకు బయలుదేరుతున్నారు. మరోవైపు విపక్షనేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో సభలు, సమావేశాలు రోడ్‌షోలు చేయనున్నారు. ఇద్దరు అగ్రనేతలు ఇవాళే యాత్రలకు సిద్ధం కావడంతో.. ఏపీలో రాజకీయవేడి మరింత రాజుకోనుంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్ర రాజకీయం వేడెక్కనుంది.
నేటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు. ప్రజాగళం పేరుతో సభలు, సమావేశాలు, రోడ్ షోలు చేయనున్నారు. ఇప్పటికే తన సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రచారం సాగిస్తున్నారు చంద్రబాబు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. నేటి నుంచి చంద్రబాబు ప్రజాగళం ప్రచార యాత్ర కూడా రాయలసీమ నుంచే ప్రారంభం అవుతుంది. 31 వరకు ఆయన ప్రచార షెడ్యూల్ ఖరారైంది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు. పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు. 28న రాప్తాడు, శింగనమల, కదిరి.. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు.. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటిస్తారు చంద్రబాబు.
ముఖ్యంగా వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టనున్నారు చంద్రబాబు. దీంతో పాటు కూటమి అధికారానికి రావడం.. రాష్ట్రానికి ఎంత అవసరమో తన ప్రసంగాల్లో ప్రజలకు వివరించనున్నారు. ఎక్కడిక్కడ కూటమి అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ .. ముందుకు సాగనున్నారు చంద్రబాబు.