Chandra Mohan Last Movie is Oxygen: టాలీవుడ్ ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబరు 11) తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్ మృతితో తెలుగు చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
హీరోగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చంద్రమోహన్ వెండితెరపై ఐదు దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించిన చంద్రమోహన్.. 1966లో ‘రంగుల రాట్నం’ సినిమాతో అరంగేట్రం చేశారు. 55 ఏళ్ల సినీ కెరీర్‌లో మొత్తంగా 932 సినిమాలు చేసిన ఆయన అనారోగ్య సమస్యలతో గత 5-6 సంవత్సరాలుగా నటనకు దూరమయ్యారు. చంద్రమోహన్ చివరగా 2017లో వచ్చిన ఆక్సిజన్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో హీరో గోపీచంద్‌కు ఆయన తండ్రి పాత్ర చేశారు.
Also Read: Chandra Mohan Died: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. చంద్రమోహన్ కన్నుమూత!
చంద్రమోహన్ తెలుగుతో పాటు పలు తమిళ సినిమాల్లోనూ నటించారు. తన నటనకు గానూ ఫిలింఫేర్, నంది అవార్డులను అందుకున్నారు. పదహారేళ్ల వయసు, సిరి సిరి మువ్వ సినిమాల్లో ఆయన నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. ఇక 1987లో చందమామ రావే సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు, 2005లో అతనొక్కడే సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు చంద్రమోహన్ అందుకున్నారు.