NTV Telugu Site icon

Jharkhand CM: నేడు ఝార్ఖండ్‌ సీఎంగా చంపయీ సోరెన్‌ ప్రమాణస్వీకారం.. 10 రోజుల్లో బలపరీక్ష!

Champai Soren Cm

Champai Soren Cm

Champai Soren to take oath as Jharkhand CM Today: నేడు ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా జేఎంఎం సీనియర్‌ నేత చంపయీ సోరెన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయాలని చంపయీకి ఝార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆహ్వానం అందించారు. శుక్రవారం సాయంత్రం ప్రమాణస్వీకరణ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. హేమంత్ సోరెన్ బుధవారం రాజీనామా చేసినప్పటి నుంచి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి మధ్య వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే తన వాదనను ఆమోదించాలని చంపయీ గవర్నర్‌ను కోరిన కొన్ని గంటల తర్వాత ఈ ఆహ్వానం వచ్చింది. ఇక వచ్చే 10 రోజుల్లో జరగనున్న ఫ్లోర్ టెస్ట్‌లో చంపయీ తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంది.

మనీలాండరింగ్‌ కేసులో హేమంత్‌ సోరెన్‌ సీఎం పదవికి రాజీనామా చేయడంతో.. సంకీర్ణ కూటమి తమ శాసనసభపక్ష నేతగా చంపయీ సోరెన్‌ని ఎన్నుకుంది. చంపయీ పలువురు ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర గవర్నర్‌ను గురువారం కలిశారు. తనకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. కొన్ని గంటల అనంతరం గవర్నర్‌ సానుకూల నిర్ణయం తీసుకున్నారు.

Also Read: Gold Rate Today: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?

తమ కూటమి ఎమ్మెల్యేలను రాష్ట్రం దాటించేందుకు జేఎంఎం సిద్దమైంది. ఓవైపు గవర్నర్‌ నిర్ణయం ఆలస్యమవుతుండడం, ప్రతిపక్ష బీజేపీ తమ ఎమ్మెల్యేలను తమవైపు ఆకర్షిస్తుందనే అనుమానాల నేపథ్యంలో.. జేఎంఎం, ఆర్జేడీ, కాంగెస్ కూటమి ఈ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలను హైదరాబాద్‌ తరలించేందుకు జేఎంఎం ఏర్పాట్లు చేసింది. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రయాణం వాయిదా పడింది. నేడు వారు హైదరాబాద్‌ వచ్చే అవకాశం ఉంది.