NTV Telugu Site icon

Challenge Vote: మీ ఓటును వేరే వాళ్లు వేశారా?.. అయితే ఇలా చేయండి!

Challenge Vote

Challenge Vote

Do You Know How To Cast Tender Vote: ఎన్నికల సమయంలో కొందరి ఓటర్ల పేర్లు జాబితాలో మిస్‌ అవ్వడం, మరికొందరు ఇతరుల పేరుతో దొంగ ఓట్లు వేయడం జరుగుతూనే ఉంటుంది. ఓటరు లిస్ట్‌లో పేరు లేకపోతే చాలా మంది నిరాశ చెందుతారు. అయితే తమ ఓటును మరొకరు వేస్తే.. చాలా మందికి ఏం చేయాలో అర్ధం కాదు. అలాంటి వారు అస్సలు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీ ఓటును మరొకరు వేసినా.. మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇందుకు పరిష్కారమే సెక్షన్‌ 49(పి). భారత ఎన్నికల సంఘం (ఈసీ) 1961లో సెక్షన్‌ 49(పి)ను అమల్లోకి తెచ్చింది. దీనిపై తమిళ హీరో విజయ్‌.. సర్కార్‌ సినిమాలో న్యాయపోరాటం చేసి తన ఓటు హక్కు దక్కించుకుంటాడు.

పోలింగ్‌ రోజు మీ ఓటును వేరే వారు వేశారని తెలిస్తే.. సెక్షన్‌ 49(పి) ద్వారా మీరు ఓటు పొందొచ్చు. దీనికోసం ముందుగా ప్రిసైడింగ్‌ అధికారిని కలవాలి. ఓటు కోల్పోయిన వ్యక్తి తానే అని ఆయన ముందు నిరూపించుకోవాలి. ఇందుకు ఓటరు గుర్తింపు కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులను సమర్పించాలి. ఎన్నారైలు అయితే పాస్‌పోర్టు కూడా చూపించొచ్చు. ఆపై ప్రిసైడింగ్‌ అధికారి ఇచ్చే ఫామ్‌ 17(బి)లో పేరు, సంతకం చేసి ఇవ్వాలి. అనంతరం టెండర్‌ బ్యాలెట్‌ పేపర్‌ను ప్రిసైడింగ్‌ అధికారి ఓటు కోల్పోయిన వ్యక్తికి ఇస్తారు. బ్యాలెట్‌ పేపర్‌పై నచ్చిన అభ్యర్థికి ఓటేసి.. మరలా ప్రిసైడింగ్‌ అధికారికి ఇవ్వాలి. ఆయన ఆ బ్యాలెట్‌ పేపర్‌ను ప్రత్యేక కవర్‌లో భద్రపరిచి.. కౌంటింగ్‌ కేంద్రానికి పంపిస్తారు. ఇలా మీరు మీ ఓటు హక్కును వినియోగించుకున్నట్లే.

Also Read: BSNL Recharge Plans: బీఎస్‌ఎన్‌ఎల్‌లో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్స్!

అయితే సెక్షన్‌ 49(పి) ద్వారా పొందే ఓటు హక్కును ఈవీఎం ద్వారా వేసేందుకు ఎలక్షన్ అధికారులు అనుమతివ్వరు. 49(పి) సెక్షన్ ద్వారా పొందే ఓటు హక్కును టెండర్‌ ఓటు, ఛాలెంజ్‌ ఓటు అని అంటారు. నిజానికి ఎన్నికల్లో 49(పి)ని వినియోగించుకున్న వారు చాలా తక్కువ అట. చాలా ప్రాంతాల్లో 49(పి) గురించి ఎక్కువగా తెలియకపోవడమే ఇందుకు కారణం అట. అందుకే ఎలక్షన్ అధికారులే చొరవ తీసుకుని అందరికి అవగాహన కల్పించాలి.