NTV Telugu Site icon

AP CM Chandrababu: సాధారణ విపత్తులా ఈ విపత్తును చూడకండి.. ఉదారంగా సాయం చేయండి..

Ap Cm Chandrababu

Ap Cm Chandrababu

AP CM Chandrababu: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఊహించని విపత్తు తలెత్తి…అపార నష్టాన్ని, కష్టాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రం ప్రజలను ఆదుకునేందుకు ఉదారత చూపాలని సీఎం కోరారు. వరద నష్టాలపై అంచనాల కోసం ఏర్పాటైన కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. అనంతరం నేడు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో స‌మావేశ‌మైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చిన ఈ విపత్తును సాధారణ విపత్తులా, గతంలో వచ్చిన వరదల్లా చూడవద్దని అన్నారు. రికార్డు స్థాయి వర్షాలు, ఆకస్మిక వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయని.. కేంద్రం ఉదారంగా ఆదుకునే విధంగా చూడాలని కేంద్ర బృందాన్ని కోరారు. ప్రజల ఆస్తులకు తీవ్ర నష్టం జరిగిందని.. పంటలు నీళ్లలో మునిగి రైతులు కుదేలయ్యారని సీఎం అన్నారు. ప్రాణ, ఆస్థి నష్టంతో పాటు…తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేక ప్రాణభయంతో తీవ్ర క్షోభను అనుభవించారని సీఎం చెప్పారు. ప్రజలను తిరిగి నిలబెట్టేలా కేంద్రం సాయం చేసేలా చూడమని కేంద్ర బృందాన్ని కోరారు.

Read Also: CM Relief Fund: ఆపన్నహస్తం.. సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు

రెండు రోజుల వ్యవధిలో 50 సెంటీమీటర్ల వర్షం కురిసింది…కృష్ణా బ్యారేజీ చరిత్రలో ఇంత పెద్ద వరద ఎప్పుడూ రాలేదు. గరిష్టంగా 11.90 లక్షల క్యూసెక్కుల వరదకు అనుగుణంగా ప్రకాశం బ్యారేజీని నిర్మించారు. మొన్న కురిసిన వ‌ర్షాల‌కు 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఇదే ఇప్పటి వరకు రికార్డు స్థాయి వరద. కృష్ణా నదికి ఒక వేళ 14 లక్షల క్యూసెక్కుల వరద వస్తే పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వరదల్లో ప్రజలు పడిన బాధలు చూసి చలించిపోయాం…. మంత్రులు, అధికారులు అంతా క్షేత్ర స్థాయిలో ఉండి పనిచేశారు. ప్రజలకు ధైర్యం ఇచ్చేందుకు విజయవాడలోనే ఉండి పనిచేశాం. కలెక్టర్ కార్యాలయాన్ని సచివాలయంలా చేసుకుని పనిచేశాం. సమస్త యంత్రాంగాన్ని రంగంలోకి దించి ప్రజలకు నమ్మకం కల్పించాం. అప్పటికప్పుడు డ్రోన్లు తెప్పించి ఆహారం సరఫరా చేశాం. సహాయక‌ చర్యల కోసం కేంద్ర సాయం తీసుకున్నాం…సర్వశక్తులూ వడ్డాం. ఫైరింజన్లు పెట్టి రోడ్లు, ఇళ్లు క్లీన్ చేశాం. ముఖ్యమంత్రి నుంచి చిన్న ఉద్యోగి వరకు క్షేత్ర స్థాయిలో ఉండి వరద సహాయక చర్యలను యుద్దంలా చేపట్టాం. పెద్ద ఎత్తున పంటనష్టం జరిగింది. నష్టపోయిన కౌలురైతులకు సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉంది. రోడ్లు, ఇరిగేషన్ వ్యవ‌స్థకు తీవ్ర నష్టం జరిగింది. సర్వం కోల్పోయి కష్టాల్లో ఉన్న వరద బాధితులకు, రైతులకు మంచి ప్యాకేజీ ఇస్తే తప్ప తిరిగి కోలుకోలేరు. అందుకే సాధారణ విపత్తులా దీన్ని చూడవద్దు అని కోరుతున్నా” అని సీఎం కేంద్ర బృందానికి వివరించారు.

బాధితుల్లో ప్రభుత్వం ప‌ట్ల న‌మ్మకం క‌నిపించింది..
అనంతరం కేంద్ర బృందానికి నాయకత్వం వహించిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం.. వరద ప్రాంతాల్లో త‌మ బృందం జ‌రిపిన ప‌ర్యట‌న‌కు సంబంధించి తమ అనుభవాలను ముఖ్యమంత్రికి వివ‌రించారు. “ఇంత స్థాయి వరదలు, బాధలు అనంతరం కూడా ప్రజలు ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వారికి సాంత్వన చేకూర్చాయి. ఇంత కష్టంలోనూ ప్రజల్లో ఎక్కడా ప్రభుత్వం పట్ల అసంతృప్తి, ఆగ్రహం కనిపించలేదు. తమకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది, సాయం చేస్తుంది అనే నమ్మకం వారిలో ఉంది. డ్రోన్ల వంటి వాటి ద్వారా ప్రభుత్వ సహాకయ చర్యలు ఎంతో వినూత్నంగా సాగాయి. భారీగా పంట నష్టం జరిగింది, మౌలిక సదుపాయాల పరంగా తీవ్రం నష్టం జరిగిందని మాకు క్షేత్ర స్థాయి పర్యటన ద్వారా తెలిసింది. బుడమేరు వరదల పై ప్రజలు తమ బాధలు చెప్పుకున్నారు. దాదాపు 60 ఏళ్ల తరువాత ఇలాంటి వరదలు వచ్చాయని ప్రజలు మాతో చెప్పారు. ఈ సమస్య నుంచి శాశ్వత‌ పరిష్కారం చూపాలని ప్రజలు కోరారు” అని కేంద్ర బృందం ఈ సమావేశంలో సీఎం కు తమ అనుభవాలు తెలిపింది. తమ పరిశీలనకు వచ్చిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి తగు సాయం అందేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని కేంద్ర బృంద అధికారులు తెలిపారు.

Show comments