New Guidelines: కోచింగ్ సెంటర్లను నియంత్రించడానికి లక్ష్యంగా కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న స్టూడెంట్స్ ను కోచింగ్ సెంటర్లు చేర్చుకోకూడదని స్పష్టం చేసింది. పాఠశాల స్థాయి విద్య పూర్తైన తర్వాత మాత్రమే కోచింగ్ సెంటర్లలో ప్రవేశానికి అనుమతి ఇవ్వాలని సూచించాయి. మంచి ర్యాంకులు లేదా మార్కులు వస్తాయని నమ్మించే ప్రయత్నాలు చేయకూడదని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లకు ఈ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
Read Also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
అయితే, పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, కోచింగ్ సెంటర్లలో సౌకర్యాల లేమి, అగ్నిప్రమాదాలు, బోధనా పద్ధతులపై పెద్ద ఎత్తున కంప్లైంట్స్ రావడంతో కేంద్రం ఈ గైడ్ లైన్స్ జారీ చేసింది. ఇక, ఫీజులు న్యాయబద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. పారదర్శకంగా రసీదులు ఉండాలని చెప్పుకొచ్చింది. కోర్సుల నుంచి నిష్క్రమించే విద్యార్థులకు తిరిగి ఫీజు సర్దుబాటు చేయాల్సిన విషయాన్ని కూడా తెలియజేసింది. మౌలిక సదుపాయాలు, విద్యార్థికి కనీస స్థలం కేటాయింపు, ప్రథమ చికిత్స, వైద్య సౌకర్యాలు, విద్యుత్, వెంటిలేషన్, తాగునీరు, భద్రతా చర్యలు తప్పనిసరిగా ఉండాలని కేంద్రం నూతన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఈ గైడ్ లైన్స్ ఉల్లంఘిస్తే సంబంధిత అధికారి కోచింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్‌ను క్యాన్సిల్ చేసే అధికారం ఉందని స్పష్టం చేసింది. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు విడుదల చేసింది.