NTV Telugu Site icon

Bharat Series Registrations: భారత్ సిరీస్ నెంబర్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Bh Series

Bh Series

కేంద్ర ప్రభుత్వం వాహనాల రిజిస్ట్రేషన్ కి సంబంధించి పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రాల వారీగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్రస్తుత వాహనాలు సైతం భారత్‌ (బీహెచ్‌) సిరీస్‌ నంబర్లను పొందవచ్చని కేంద్రం పేర్కొంది. ఈమేరకు కేంద్రం అనుమతి ఇచ్చింది. బీహెచ్‌ సిరీస్‌ (BH Series) నిబంధనలను మార్చినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ తెలిపింది. బీహెచ్‌ సిరీస్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకే తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు కొత్త వాహనాలు మాత్రమే బీహెచ్‌ సిరీస్‌ తీసుకోడానికి వీలుండేది. ‘అవసరమైన పన్ను చెల్లింపులు చేసి సాధారణ రిజిస్ట్రేషన్‌ మార్కు ఉన్న వాహనాలు సైతం బీహెచ్‌ సిరీస్‌కు మారొచ్చ’ని కేంద్రం పేర్కొంది.

Read Also: Astrology: డిసెంబర్‌ 17, శనివారం దినఫలాలు

నివాసం ఉంటున్న లేదా పనిచేస్తున్న ప్రాంతంలో, తమ వాహనం కోసం బీహెచ్‌ సిరీస్‌ దరఖాస్తు సమర్పించేందుకు వీలుగా ‘రూల్‌ 48’ను సైతం సవరించాలని మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ వెసులుబాటును దుర్వినియోగం చేయకుండా ‘వర్కింగ్‌ సర్టిఫికెట్‌’ను ప్రైవేటు రంగ ఉద్యోగులు సమర్పించాల్సి ఉంటుంది. రవాణా శాఖ వాటిని పరిశీలించి బీహెచ్ సిరీస్ అందచేస్తుంది. ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి నుంచి మరొక రాష్ట్రానికి చెందిన వ్యక్తికి వ్యక్తిగత వాహనాల బదిలీ సులువుగా ఉండేందుకు, గతేడాది సెప్టెంబరులో సరికొత్త రిజిస్ట్రేషన్‌ ‘భారత్‌ సిరీస్‌ (బీహెచ్‌ సిరీస్‌)’ను కేంద్రం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

బీహెచ్ సిరీస్ ని ఇలా అర్థం చేసుకోండి 

‘నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్న రక్షణ రంగ సిబ్బంది, కేంద్ర ప్రభుత్వ/రాష్ట్ర ప్రభుత్వ/రాష్ట్ర ప్రభుత్వ రంగ/ప్రైవేటు రంగ సంస్థలకు బీహెచ్‌ సిరీస్‌ను అందుబాటులోకి తెచ్చిన’ట్లు ఒక ప్రకటనలో మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారినప్పుడు, మళ్లీ వాహన రిజిస్ట్రేషన్‌ చేయించే శ్రమ తప్పుతుంది. దీనివల్ల డబ్బుకూడా ఆదా అవుతుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఇప్పటిదాకా 49,600 వాహనాలు భారత్‌ సిరీస్‌ కింద రిజిస్టర్‌ అయ్యాయి. కేంద్రం వెసులుబాటు ఇవ్వడంతో రాబోయే కాలంలో వీటి రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని భావిస్తున్నారు.

Read Also: Fire Accident: మంచిర్యాలలో ఘోర అగ్నిప్రమాదం.. 6మంది సజీవదహనం