ఏపీలో కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చడం, నిధుల గోల్‌మాల్ అంశాలపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర పథకాల పేర్లను జగన్ సర్కారు తమకు ఇష్టం వచ్చినట్లు మార్చడం సరికాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో జగన్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేంద్రం ప్రవేశపెట్టిన పోషణ్ అభియాన్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్స్, ఇంటిగ్రేటెడ్ ఛైల్మ్ డెవలప్‌మెంట్ స్కీమ్స్ పేర్లను పథకాలకు జగనన్న గోరుముద్ద, జగనన్న పాలవెల్లువ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణగా మార్చడాన్ని కేంద్రం తీవ్రంగా తప్పుబట్టింది.
Read Also: జవాద్ తుఫాన్.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
దీంతో 2021-22 ఏడాదికి సంబంధించి ఐసీడీఎస్, ఐసీపీఎస్ పథకాలకు ఇచ్చిన రూ.187 కోట్లకు లెక్కలు చూపాలని జగన్ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్ల మార్పుపై ఇటీవల కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఎంపీ రఘురామ ఫిర్యాదుతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. జగన్ సర్కారును హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శికి కేంద్ర మహిళా శిశు సంక్షేమ అభివృద్ధిశాఖ లేఖ రాసింది. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటి జగన్ ప్రభుత్వం వరకు కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి తమవిగా చెప్పుకుని ఏపీ సర్కారు అమలు చేసుకోవడంపై బీజేపీ నేతలు మండిపడుతూనే ఉన్న సంగతి తెలిసిందే.
