NTV Telugu Site icon

Kishan Reddy : ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖాళీగా ఉండకూడదనేదే ప్రధాని మోడీ లక్ష్యం

Kishanreddy

Kishanreddy

Kishan Reddy : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఒక్క ఉద్యోగం కూడా ఖాళీగా ఉండకుండా భర్తీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. రోజ్ గార్ మేళా ద్వారా ఇప్పటి వరకు 8.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఆయన వెల్లడించారు. సోమవారం బషీర్ బాగ్‌లో భారతీయ విద్యా భవన్‌లో జరిగిన రోజ్‌గార్ మేళాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భారత ఆహార సంస్థ, సీబీఐటీ, ఆదాయపు పన్ను శాఖ, తపాలా శాఖ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎయిమ్స్, రైల్వే వంటి విభాగాల నుంచి 154 మందికి నియామక పత్రాలు అందించారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఒక్క రోజే 51 వేల మంది కేంద్ర ఉద్యోగాలు పొందుతున్నారని తెలిపారు. వచ్చే ఉద్యోగానికి పూర్ణ అంకితంతో పని చేయాలని, యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని ఆయన కోరారు. 12 లక్షల ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేయడం లక్ష్యంగా ఉన్నామని చెప్పారు.

ఆర్థిక వృద్ధి కోసం ప్రభుత్వ విభాగాలు విద్య, వైద్యం, రక్షణ, పరిశోధన వంటి కీలక రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాయి. ఈ పెట్టుబడులు ఉద్యోగావకాశాలను పెంచుతాయన్నారు. మోడీ ఆధ్వర్యంలో దేశ అభివృద్ధి, ఉగ్రవాదానికి నిరోధం, విద్యుత్ కొరత లేకుండా నూతన భారతాన్ని ఆవిష్కరించినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. ప్రధాని మోడీ 365 రోజులు దేశ అభివృద్ధి కోసం పయనిస్తున్నారని, ప్రతి దీపావళికి ఆర్మీ జవాన్లతో గడిపేందుకు సరిహద్దుల వైపు వెళ్లనున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.