Site icon NTV Telugu

E vehicle policy: ఈ-వాహనాల విధానానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్

Evp

Evp

ఈ-వాహనాల విధానానికి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత్‌ను ఈ-వాహనాల తయారీ కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ-వాహనాల తయారీ పరిశ్రమలకు కేంద్రం కూడా ప్రోత్సాహకాలు అందజేయనుంది. తక్కువ కస్టమ్స్‌ డ్యూటీకి పరిమిత సంఖ్యలో కార్ల దిగుమతికి అనుమతి ఇవ్వనుంది.

EVల తయారీకి ప్రధాన కేంద్రంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ-వాహన విధానాన్ని ఆమోదించింది.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో పవర్‌హౌస్‌గా భారతదేశ స్థానాన్ని పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈవీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం.. స్వదేశీ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పథకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అత్యాధునిక సాంకేతికతతో EVలు తయారు చేసేందుకు పూనుకుంది.

వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈవీ విధానానికి ఆమోదం తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి భారత్ అనుకూలమైనదిగా కేంద్రం తెలిపింది. అలాగే దేశంలోని ఆటోమోటివ్ ల్యాండ్‌స్కేప్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉందని ఆ శాఖ పేర్కొంది.

ఎలక్ట్రిక్ వాహనాలతో ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని అరికట్టవచ్చు. ప్రాముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజా ఆరోగ్యం మెరుగుపడుతుంది. పర్యావరణంలో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకోసమే ఈవీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

ఈవీల తయారీకి భారత్ గమ్యస్థానంగా మారడంతో పాటు అంతర్జాతీయ ప్రముఖ ఈవీ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలు కలుగుతుందని కేంద్రం పేర్కొంది. భారత్‌లోకి ప్రవేశించేందుకు అమెరికా కార్ల తయారీ కంపెనీ టెస్లాకు ఈ పాలసీ ద్వారా మార్గం సుగమం అయినట్లే.

కొత్త ఈవీ పాలసీ ప్రకారం ఏదైనా కంపెనీ కనీసం రూ.4,150 కోట్లు దేశంలో పెట్టుబడిగా పెడితే.. పలు రాయితీలు లభిస్తాయి. ఈ పాలసీ వల్ల భారతీయులకు కొత్త తరహా సాంకేతికత అందుబాటులోకి రావడంతో పాటు మేకిన్‌ ఇండియాకు ఊతం ఇచ్చినట్లవుతుందని వాణిజ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. భారతదేశంలో తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేసే కంపెనీలను ప్రోత్సహించేందుకు కనిష్ట ధర, బీమా మరియు సరుకు రవాణా, వాహనాలపై 15 శాతమే కస్టమ్స్ సుంకం విధించనుంది. ఇక పెట్టుబడి పెట్టే కంపెనీలు తక్కువ కస్టమ్స్ డ్యూటీ రేటుతో EVల పరిమిత దిగుమతులకు అనుమతించనుంది.

Exit mobile version