NTV Telugu Site icon

EVM Vandaalism: మాచర్ల సంఘటనపై సీఈసీ సీరియస్.. ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు

Cec

Cec

EVM Vandaalism: మాచర్ల సంఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఈఓ ముకేష్‌కుమార్‌ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం తాఖీదు పంపింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం సంఘటనపై ఏపీ సీఈఓను కేంద్ర ఎన్నికల సంఘం వివరణ అడిగింది. ఈ సంఘటనలో ఎమ్మెల్యే ప్రమేయం ఉందా అని సీఈసీ ప్రశ్నించింది. ఒకవేళ ఎమ్మెల్యే ప్రమేయం ఉంటే కేసు ఎందుకు పెట్టలేదని అడిగింది. కేసులో ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారా అని సీఈఓను కేంద్ర ఎన్నికల సంఘం నిలదీసింది. ఒకవేళ నిందితుడిగా చేరిస్తే ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారా? లేదా? అని ఎన్నికల సంఘం ప్రశ్నించారు. ఒకవేళ కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోపు తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం.

Read Also: SIT Investigation: అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లోనే సిట్ మకాం

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్‌ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నెల 13న ఏపీలో పోలింగ్‌ సందర్భంగా జరిగిన ఆ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలో రికార్డయిన వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చింది. రెంటచింతల మండలంలోని పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రం 202లో ఎమ్మెల్యే ఈ చర్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. తొలుత గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేసినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా వీడియో బయటకు రావడంతో.. ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారు. ఈ విషయాన్ని ఈసీ చాలా తీవ్రంగా పరిగణిస్తూ, ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి తెలియజేయాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది. తద్వారా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో భవిష్యత్తులో ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు సాహసం చేయరని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈవీఎం ధ్వంసానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.