CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్‌పై ప్రత్యేక శిక్షణ..

Ccrt Workshop

Ccrt Workshop

CCRT Workshop: హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ (CCRT) రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో “NEP 2020కు అనుగుణంగా విద్యలో తోలుబొమ్మలాట పాత్ర” అనే అంశంపై అక్టోబర్ 1 నుంచి 16వ తేదీ వరకు వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. వర్క్‌షాప్‌లో భాగంగా CCRT రిసోర్స్ పర్సన్, విజిటింగ్ ఫ్యాకల్టీ, ప్రముఖ వెంట్రిలోక్విస్ట్, వెంట్రిలోక్విజంలో ప్రపంచ రికార్డు హోల్డర్ డా. జి.వి.ఎన్. రాజు ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్, స్వర సంస్కృతి ప్రాముఖ్యతపై శిక్షణ ఇచ్చారు. బోధనలో స్వరం, స్వర వినియోగం ఎలా ప్రభావం చూపుతాయో వివరించడంతో పాటు వెంట్రిలోక్విజం కళలో స్వరం పాత్రను ప్రదర్శన ద్వారా చూపించారు.

ఈ వర్క్‌షాప్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాలు, వివిధ విభాగాలకు చెందిన మొత్తం 50 మంది పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యా బోధనలో సృజనాత్మకత, కళల వినియోగం, ఉపాధ్యాయుల కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వర్క్‌షాప్‌ను CCRT ఫీల్డ్ ఆఫీసర్ సౌందర్య కౌశిక్, కోఆర్డినేటింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రవీణ్ పర్యవేక్షిస్తూ సమన్వయం చేస్తున్నారు.