NTV Telugu Site icon

Vizag Drug case: ఇంటర్నేషనల్ డ్రగ్స్ డీల్.. ఏపీలో కలకలం.. సీబీఐ విచారణలో ఏం తేలింది?

Cbi

Cbi

Vizag Drug case: విశాఖ బిగ్ డ్రగ్ రాకెట్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది.విచారణను సీబీఐ వేగవంతం చేసింది.మరిన్ని సాంకేతిక ఆధారాలు సేకరించే దిశగా వెళ్తోంది. మత్తు పదార్థాల నిర్ధారణ కోసం నార్కోటిక్స్ బ్యూరోను సైతం రంగంలోకి దించింది. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ పరిశ్రమలో సీబీఐ సోదాలు ముగిశాయి. ఏడుగురు సీబీఐ అధికారుల బృందం వివిధ భాగాల్లో మూడు రోజులుగా తనిఖీలు నిర్వహించింది. ఇప్పటికే పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించింది. ల్యాబ్‌ను పరిశీలించి ఫోరెనిక్స్ బృందాన్ని పిలిపించారు. వైజాగ్ నుంచి వచ్చిన ఫోరెన్సిక్‌ బృందం.. ల్యాబ్‌లో ఉన్న వివిధ శాంపిల్స్ సేకరించి విశాఖకు తీసుకెళ్లారు. బ్రెజిల్ టు వైజాగ్ వయా జర్మనీ. ఇదీ విశాఖ పోర్టులో సీబీఐ బ్రేక్ చేసిన డ్రగ్ రాకెట్. ఆపరేషన్‌ గరుడలో భాగంగా CBI దాదాపు 25 వేల కేజీల డ్రై ఈస్ట్ ను స్వాధీనం చేసుకుని వరుసగా మూడో రోజు విస్తృత విచారణ కొనసాగించింది. కంటైనర్ బుక్ చేసిన సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ ఉన్నత స్థాయి సిబ్బందిపై చర్యలకు సిద్ధమవుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన CBI బృందం లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది. అంతర్జాతీయ డ్రగ్ నెట్ వర్క్ లింకులపైన ఆరా తీస్తోంది.

ఈ ఏడాది జనవరి 14న బ్రెజిల్ లో ఐసీసీబీ అనే కంపెనీ నుంచి రొయ్యల మేతలో వినియోగించే డ్రైఈస్ట్ ఆర్డర్ చేసింది సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్. దాదాపు రెండు నెలల తర్వాత సరుకుతో షిప్ విశాఖ పోర్టుకు చేరుకుంది. కంటైనర్ ను దించి వెళ్ళిపోయింది. ఆ నౌక కదలికలపై అనుమానం వచ్చిన ఇంటర్ పోల్…సింథటిక్ డ్రగ్స్ సమాచారం CBI కి పంపించింది. ఈనెల 18న సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ సంస్థ కోసం వచ్చిన సుమారు 25వేల కేజీల డ్రై ఈస్ట్ లో మాదకద్రవ్యాలు వున్నట్టు గుర్తించారు. కంటైనర్‌లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగ్‌లు.. మొత్తంగా 25 వేల కిలోల ఇనాక్టివ్‌ డ్రై ఈస్ట్‌తో మిక్స్‌ అయిన డ్రగ్స్‌ ఉన్నాయి. అందులో ఓపియం, హెరాయిన్, కొకైన్‌ నిర్థారించేందుకు A, B, E పరీక్షలు నిర్వహించారు. సీబీఐ, కస్టమ్స్‌, నార్కోటిక్ విభాగాలతో పాటు సంధ్యా ఆక్వా కంపెనీ ప్రతినిధుల సమక్షంలో టెస్ట్‌లు జరిగాయి. ఈ పరీక్షల్లో కొకైన్‌, హెరాయిన్‌ సహా 100 మాదక ద్రవ్యాల‌ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు.

చేపల మేత తయారీ పరిశ్రమలో డ్రై ఈస్ట్ వాడకం అత్యంత సహజమని….తొలిసారిగా రప్పించిన కంటైనర్ లోకి డ్రగ్స్ ఏవిధంగా వచ్చాయో తెలియదని సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ సంస్థ చెబుతోంది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం తమ వ్యాపార లక్షణం కాదని…..సమగ్ర విచారణ జరిపి నిందితులను గుర్తించాలని కోరుతోంది. ఇక, నార్కోటిక్స్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే ల్యాబ్ కు పంపిన శాంపిల్స్ రిపోర్ట్స్ త్వరితగతిన రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు కంటైనర్ టెర్మినల్ లోపల సీజ్ చేసిన అనుమానిత డ్రగ్స్ నిర్ధారణ కోసం వివిధ రకాల టెస్టులు చేపట్టారు. 140 వరకు నార్కోటిక్స్ పరీక్షలు చేశారు. వీటి ఆధారంగా కీలక వ్యక్తుల ప్రమేయం నిర్ధారణయితే…అరెస్టులు చేసే అవకాశాలున్నాయి.

50వేల కోట్ల రూపాయలు విలువచేసే డ్రగ్స్ విశాఖ సాగర తీరాన పట్టుబడంతో ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ డ్రగ్స్ దందా వెనక ఎవరెవరి హస్తాలు ఉన్నాయో వెలికితీసేందుకు సీబీఐ ఎంక్వైరీ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సీబీఐకి, విశాఖ పోలీసులకు మధ్య మాటల వివాదం నెలకొంది. విశాఖ పోలీసుల వల్లే సోదాలు ఆలస్యమైయ్యాయని సీబీఐ పేర్కొంది. అదే విషయాన్నీ FIR లో నమోదు సీబీఐ చేసింది. దీంతో సీబీఐపై విశాఖ సీపీ రవిశంకర్ ఫైర్ అయ్యారు.విచారణ సమయంలో జాప్యానికి తాము కారణం కాదన్నారు.కంటైనర్ టర్మినల్ తమ కమిషనేట్ పరిధిలోకి రాదని చెప్పారు. కస్టమ్స్ ఎస్పీ పిలిస్తే తాము వెళ్ళామని చెప్పారు. ఇక సీబీఐ కేవలం డాగ్ స్క్వాడ్ ను మాత్రమే అడిగిందని.. తాము సీబీఐ అడిగిన డాగ్ స్క్వాడ్ ఇచ్చామన్నారు. డ్రగ్స్ కేసు విషయంలో సీబీఐకి సహకరించడంలేదన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అసలు ఈ డ్రగ్స్ ఎవరుకోసం తెప్పించారు. ఇంత పెద్దమొత్తంలో తీసుకొచ్చేదెవరు?ఎవరెవరి హస్తం ఉందని అనేది సీబీఐ ఆరా తీస్తోంది. ఎన్నికల వేళ విశాఖ తీరానికొచ్చిన 25వేల కేజీల డ్రగ్స్ కంటైనర్ కలకలం రేపుతోంది.

25 వేల కేజీల డ్రగ్స్ పట్టుబడటం మామూలు విషయం కాదు. అదీ ఎన్నికల వేళ.దేశంలో ఇంతపెద్దమొత్తం మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్న సంఘటనలు చాలా తక్కువే.మరి ఎన్నికల వేళ 50 వేల కోట్ల విలువైన డ్రగ్స్ తెప్పించిదెవరు?ఈ డ్రగ్ డీల్ వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయా?ఎన్నికల్లో డబ్బు కోసమే డ్రగ్స్ తెప్పించారా?వీటి అమ్మటంతో వచ్చిన డబ్బుని ఎన్నికల్లో ఖర్చు చేయాలనుకున్నారా?ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందిరి మదిని తొలుస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సీబీఐ మాత్రమే సమాధానం చెప్పగలుగుతుంది.టెస్టుల్లో ఎన్నివేల కేజీల డ్రగ్స్ ఉన్నాయి.ఏయే రకాలు ఉన్నాయో…ల్యాబ్ టెస్టుల ఫలితాలు వస్తే కానీ తెలివదు.ఈ టెస్టుల ఫలితాల వచ్చాక సీబీఐ అసలు శోధన షురూ అవుతుంది.ఈ డ్రగ్ డీల్ ఎవరెవరో తేల్చే పనిలో పడుతుంది.

ఓవైపు సీబీఐ విచారణ కొస్తుండగానే విశాఖ డ్రగ్స్ కంటైనర్ వ్యవహారం రాజకీయ రంగుపులుముకుంది. డ్రగ్స్‌ పై పార్టీల మధ్య డైలాగ్‌ వార్ పీక్స్‌ కెళ్లింది. మీరంటే మీరే కారణమంటూ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఫలితంగా ఎన్నికల వేళ మత్తు రాజకీయం మరింత వేడెక్కింది.అయితే ఏ పార్టీలతో తమకు సంబంధం లేదంటోంది సంధ్య ఆక్వా పరిశ్రమ యాజమాన్యం. విశాఖ పోర్ట్‌లో 50 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుబడటం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఎన్నికల సమయంలో ఈ అంశం అధికార, విపక్షాలకు అస్త్రంగా మారింది. సంధ్యా ఎక్స్‌పోర్ట్స్‌తో సాన్నిహిత్యం మీదంటే మీదంటూ పార్టీలు ఆరోపించుకుంటున్నాయి. ఈసీకి సైతం ఫిర్యాదు చేసుకున్నాయి. విశాఖపట్నం డ్రగ్స్ వ్యవహారంపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. ఎన్నికల ముందు 25 వేల కేజీల డ్రగ్స్ కంటైనర్ పట్టుబడటంతో…ఇది ప్రజలకు పంపిణీ చేసేందుకు తెచ్చారా అన్న కోణంలో దర్యాప్తు జరపాలని సూచించింది. ముఖ్యంగా ఎన్నికల్లో లబ్ధికోసం చంద్రబాబు ప్రయత్నించే అవకాశముందన్న అంశాన్ని ఈసీ దృష్టికి తెచ్చారు వైసీపీ నేతలు. విశాఖలో దొరికిన డ్రగ్స్‌తో టీడీపీ నేతల ప్రమేయం ఉందన్న అనుమానం ఉందన్నారు సజ్జల. తప్పించుకోవడానికే వైసీపీ ప్రభుత్వంపై నిందవేస్తున్నారని ఫైర్ అయ్యారు. విశాఖ పోర్టులో టీడీపీకి సంబంధించిన వారి డ్రగ్స్ దొరికితే తమకు సంబందం లేనట్టుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కాకాణి. వాటిని ప్రభుత్వానికి లింకుందన్నట్టుగా ఆపాదించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖ డ్రగ్స్ పై పొలిటికల్ రగడ తీవ్రరూపు దాల్చింది. దీనికి వైసీపీ నేతలే కారణమంటూ చంద్రబాబు .. తన ఎక్స్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. దీంతో పలువురు టీడీపీ నేతలు సైతం.. విశాఖ డ్రగ్స్ వెనక వైసీపీ నేతలున్నారంటూ ఆరోపణలు చేశారు. విశాఖ డ్రగ్స్‌ కేసు వ్యవహారం బయటకు రాకుండా ప్రయత్నించినదెవరో చెప్పాలన్నారు. కంటైనర్‌లోని కొకైన్‌ను అమ్మి, ఆడబ్బును ఎన్నికల్లో ఖర్చు చేయాలన్నది సీఎం జగన్ వ్యూహంగా కనిపిస్తోందని ఆరోపించారు. విశాఖ పోర్టులో దొరికిన 25 వేల కిలోల మాదక ద్రవ్యాల దిగుమతి వెనుక ఎవరున్నారో వెంటనే వెలికి తీయాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ సర్కార్ డ్రగ్స్‌కి రాజధానిగా మార్చిందని ఆరోపించారు.ఆపరేషన్ గరుడ’ ద్వారా రాష్ట్రంలోని డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయాలని ఆయన కోరారు. మరోవైపు..విశాఖ డ్రగ్స్ కంటైనర్ల వెనక వైసీపీనే ఉందని.. తమనేతలను ఇందులో లాగడం తగదన్నారు బీజేపీ నేతలు. అవాస్తవాలు ప్రచారం చేయొద్దని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన డ్రగ్స్ పై రాజకీయ పార్టీల పరస్పర ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.సార్వత్రిక ఎన్నికల వేళ విశాఖలో చిక్కిన డ్రగ్స్ కంటైనర్ ఎవరిది? ఈ కంటైనర్‌ను ఎవరు, ఎందుకు తెప్పించారు. ఇంత పెద్దమొత్తంలో డ్రగ్స్ ప్రజల్లోకి వస్తే జరిగే దారుణానికి కారకులెవరు? ఇప్పుడిదే అంశంపై రాష్ట్రంలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. నిజంగా డగ్స్ అమ్మి…వచ్చిన డబ్బులతో ఎన్నికల్లో ఖర్చు చేసే వాళ్ల అనే చర్చ నడుస్తోంది. ఈ ఇంటర్నేషనల్ బిగ్ డ్రగ్ డీల్ వెనక ఎవరు ఉన్నారనే దానిపై మాట్లాడుకుంటున్నారు.

Show comments