Election Alliance: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేచింది.. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. ఇదే సమయంలో.. అసలు పార్టీ ఎందుకు పెడుతున్నాం.. తమ లక్ష్యం ఏంటి? అనే విషయాలను వివరిస్తూనే.. మరోవైపు పొత్తులపై కూడా క్లారిటీ ఇచ్చేశారు. సమస్యల పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలని అంబేద్కర్ చెప్పారు. ఆ దిశగా అడుగులేస్తూ రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నా. వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో పార్టీని పెడుతున్నాం. మా పార్టీ పెట్టిన పార్టీ కాదు.. ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీగా అభివర్ణించారు వీవీ..
ఇక, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తేవడానికి జై భారత్ నేషనల్ పార్టీ పెట్టానని ప్రకటించారు సీబీఐ ఎక్స్ జేడీ.. నిరుద్యోగం ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉందని.. ప్రత్యేక హోదా గురించి ఎవ్వరూ మాట్లాడడంలేదన్న ఆయన.. నిరుద్యోగం పెరగడానికి ప్రత్యేక హోదా రాకపోవడమే కారణం అన్నారు. ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజే ముద్దన్నారు కొందరు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. కానీ మెడలు వంగలేదు. ప్రత్యేక హోదా రాలేదన్నారు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా తేవడానికే జై భారత్ నేషనల్ పార్టీ పుట్టిందని స్పష్టం చేశారు. మేం ఎవ్వరికీ తలవంచం.. సాగిలపడమని పేర్కొన్నారు. అభివృద్ధితో అవసరాలు తీరుస్తామని ప్రకటించారు. సరైన పాలసీలు లేకపోవడం వల్లే ఉపాధి లభించడం లేదు. రాజకీయాలు కొన్ని కుటుంబాలకు పరిమితం అయ్యాయి. ఎవరో నాన్నగారు ఓ హోదాలో వాళ్ల పిల్లలకూ అదే హోదా ఉండాలా..? అని ప్రకటించారు. అంగబలం, అర్ధబలం లేదు.. కానీ ప్రజల నైతిక బలం మాకుంది అన్నారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు కూడా సమయం దగ్గర పడుతోన్న వేళ.. పొత్తులు కీలకంగా మారాయి.. అధికార వైసీపీ మరోసారి ఒంటరిగానే బరిలోకి దిగుతుండగా.. టీడీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీచేయాలని నిర్ణయించాయి.. ఆ దిశగా కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటున్నాయి.. ఇక, బీజేపీ ఇప్పటి వరకు జనసేనతో ఉన్నా.. ఎన్నికల నాటికి టీడీపీ, జనసేనతో కలిసి వెళ్తుందా? అనే చూడాలి.. ఇలాంటి సమయంలో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. మేం ఓట్లు చీల్చం.. సీట్లు చీల్చి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి అవకాశం పోయిందనే బాధ లేదు. ప్రభుత్వాలు ఐదేళ్లూ ఉండని పరిస్థితి.. ఎప్పుడు కూలుతాయో తెలియదంటూ హాట్ కామెంట్లు చేశారు. నేను రాజకీయాల్లోకి దిగలేదు.. దూకాను అని పేర్కొన్నారు. మేం ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం.. నా కాళ్ల మీదే మేం ఎదుగుతామని పొత్తులపై తేల్చేశారు వీవీ లక్ష్మీనారాయణ.
కాగా, వీఆర్ఎస్ తీసుకున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.. గత ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరిన ఆయన.. గ్లాసు గుర్తుపై విశాఖ లోక్‌సభ ఎంపీగా బరిలోకి దిగారు.. 2.80 లక్షలకు పైగా ఓట్లు సాధించినా విజయం దక్కలేదు.. ఆ తర్వాత జనసేనకు గుడ్‌బై చెప్పిన వీవీ.. నాలుగున్నరేళ్లుగా విశ్లేషకుడిగా మారిపోయారు. అయితే, తనకు కలిసివచ్చే ఏ వేదికను కూడా ఆయన వదలకుండా.. రైతులు, యువజనులు, విద్యార్థులు.. ఇలా నిత్యం ప్రజల్లో ఉంటూ వచ్చారు.. ఇక, పార్టీ ఏర్పాటుపై తన అనుచరులతో చర్చించారు.. విశాఖ నుంచి మరోసారి పోటీచేయడం పక్కా అని ప్రకటించిన ఆయన.. కొత్త పార్టీ పెట్టేందుకే మొగ్గుచూపారు.. అందులో భాగంగానే ఆరు నెలల క్రితమే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ‘జై భారత్ నేషనల్‌పార్టీ’ పేరుతో దరఖాస్తు పెట్టుకున్నారు. తాజాగా, విజయవాడలో రాత్రి సమయంలో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.. ఈరోజు అధికారికంగా పార్టీ పేరును ప్రకటించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.
