CBI Case On Officials : అర్హత లేని విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్‌లకు సాయం చేసినందుకు అధికారులకు తగిన శాస్తి జరిగింది. 73 మంది విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లకు అర్హత లేకపోయిన భారతదేశంలో మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి సహాయం చేసినందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్, 14 రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్‌ల అధికారులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కేసు నమోదు చేసింది. ఒక విదేశీ వైద్య గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హత సాధించాలి. ఆ తర్వాత వారు భారతదేశంలో వైద్యరంగంలో వృత్తిని పొందాలనుకుంటే జాతీయ వైద్య కమిషన్ లేదా రాష్ట్ర కౌన్సిల్‌లలో తాత్కాలిక లేదా శాశ్వత నమోదు చేసుకోవాలి.
Read Also: Kerala Cunning Man : స్వీట్లు పంచాడు.. 100మందికి దావత్ అన్నాడు.. బిల్లు కట్టకుండా ఉడాయించాడు
ఇవేమీ చేయకుండా నకిలీ రిజిస్ట్రేషన్లతో ప్రాక్టీస్ చేస్తున్న 73మంది విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లను ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన దర్యాప్తులో గుర్తించింది. వీరంతా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రికార్డుల ప్రకారం పరీక్షలో అర్హత సాధించని వారే. అర్హత లేని వ్యక్తుల ద్వారా ఇటువంటి మోసపూరిత, నకిలీ రిజిస్ట్రేషన్ పౌరుల ఆరోగ్యం, శ్రేయస్సుకు హానికరమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఈ అభ్యర్థులలో ఎక్కువ మంది 2011 – 2022 మధ్య రష్యా, ఉక్రెయిన్ , చైనాలలో చదువుకున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఫిర్యాదు ఆధారంగా, అవినీతి, నేరపూరిత కుట్ర, ఫోర్జరీ, మోసం ఆరోపణలపై సిబిఐ అధికారులపై అభియోగాలు నమోదు చేసింది. వీరిలో చాలా మంది బీహార్, అస్సాం, ఉత్తరప్రదేశ్‌లలో మెడిసిన్ ప్రాక్టీస్ చేసేందుకు రిజిస్ట్రేషన్లు పొందారని సీబీఐ వర్గాలు తెలిపాయి.