Site icon NTV Telugu

Currency: పెద్ద నోట్ల రద్దుకు ఆరేళ్లు పూర్తి.. కానీ ప్రజల వద్ద డబ్బెంతో తెలుసా?

Currency

Currency

Currency: పెద్ద నోట్ల రద్దు చర్య తర్వాత ఆరేళ్ల తర్వాత కూడా నగదు వినియోగం ఇంకా తగ్గలేదు. ప్రజల వద్ద ఉన్న కరెన్సీ అక్టోబరు 21 నాటికి రూ. 30.88 లక్షల కోట్ల కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. రోజురోజుకీ కొత్త డిజిటల్ చెల్లింపుల సాధనాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. నగదుకు మాత్రం ప్రాధాన్యం తగ్గడం లేదు. నోట్ల రద్దు జరిగిన నాటితో పోలిస్తే ప్రజల వద్ద ఉన్న డబ్బు విలువలో 70 శాతానికి పైగా వృద్ధి నమోదు కావడం గమనార్హం. నోట్ల రద్దును ప్రకటించిన 2016 నవంబరు 4 నాటితో పోలిస్తే ప్రజల వద్ద ఉన్న నగదు విలువ 71.84 శాతం పెరిగినట్లు ఆర్‌బీఐ విడుదల చేసిన నివేదిక ద్వారా వెల్లడైంది. ఆర్థిక వ్యవస్థలో అవినీతి, నల్లధనాన్ని తగ్గించడమే అంతిమ లక్ష్యంగా రూ.500, రూ.1000 నోట్లను ఉపసంహరించుకునే నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

2016 నవంబరు 4 నాటికి ప్రజల వద్ద ఉన్న నగదు విలువ రూ.17.7 లక్షల కోట్లుగా ఉండగా.. అక్టోబర్‌ 21, 2022 నాటికి అది రూ.30.88 లక్షల కోట్లకు పెరిగింది. ఈ సమాచారం ఆర్‌బీఐ విడుదల చేసిన ద్రవ్య సరఫరాపై డేటాలో వెల్లడైంది. పబ్లిక్‌తో ఉన్న కరెన్సీ అనేది ప్రజలు లావాదేవీలు జరపడానికి, లావాదేవీలను పరిష్కరించుకోవడానికి, వస్తువులు మరియు సేవలను కొనుగోలు చేయడానికి ఉపయోగించే నోట్లు, నాణేలను సూచిస్తుంది. చెలామణిలో ఉన్న కరెన్సీ నుండి బ్యాంకుల్లో నగదును తీసివేసిన తర్వాత ఈ సంఖ్య వచ్చింది. ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం క్రమంగా పెరుగుతోంది. కొత్త కొత్త డిజిటల్‌ చెల్లింపు సాధనాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. నగదు చలామణి సైతం అదే స్థాయిలో పెరుగుతండడం గమనార్హం. డిజిటల్ చెల్లింపులపై 2019 ఆర్బీఐ అధ్యయనం పాక్షికంగా సమస్యను పరిష్కరించింది.

Team India: 2007 మేజిక్ రిపీట్ అవుతుందా? మరోసారి విశ్వవిజేత అవుతామా?

డీమోనిటైజేషన్ తర్వాత భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని, అయినప్పటికీ దేశంలో డిజిటల్ చెల్లింపులు జీడీపీ నిష్పత్తి తక్కువగా ఉన్నాయని ఆర్బీఐ పేర్కొంది. ఇటీవల దీపావళి వారంలో నగదు చలామణిలో ఉన్న కరెన్సీ రూ.7,600 కోట్ల మేర తగ్గినట్లు ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. గత రెండు దశాబ్దాల్లో నగదు చెలామణి తగ్గడం ఇదే మొదటిసారని పేర్కొంది. దేశంలో ప్రజలు డిజిటల్‌ చెల్లింపులపై ఆధారపడడం పెరగడమే ఇందుకు కారణమని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణాత్మక మార్పులకు లోనవుతున్నట్లు వెల్లడించారు.

Exit mobile version