NTV Telugu Site icon

కేరళలో కల్లోలం.. ఒక్క రోజులో 31 వేల కేసులు

థర్డ్‌ వేవ్‌ భయాలు వెంటాడుతున్నాయి.. కేరళ, కర్నాటక కేంద్రంగా అది విజృంభించనుందా? అంటే అలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. కేరళలో అయితే పరిస్థితి మరీ దారుణం. ఓనమ్‌ తరువాత పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా పెరిగాయి. బుధవారం ఒక్క రోజే 31 వేల 445 కేసులు రిజిస్టరయ్యాయి. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో ఇది 65 శాతం. అలాగే టెస్ట్‌ పాజిటివ్‌ రేట్‌ కూడా అమాంతం పెరిగింది. ప్రస్తుతం అది 19 శాతంగా ఉంది. మే 20 తరువాత కేరలలో డెయిలీ కేసులు 30 వేలు దాటటం ఇదే మొదలు. సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్నసమయంలో మాత్రమే ఈ స్థాయిలో కేసులు వచ్చాయి. దేశమంతా కరోనా తగ్గుతున్న సమయంలో ఇక్కడ ఇలా విరుచుకుపడటం ఆందోళన కలిగిస్తోంది. కేరళలోని ఏడు జిల్లాల్లో 2 వేల చొప్పున కొత్త కేసులు వెలుగు చూశాయి. ఎర్నాకులం జిల్లాలో అయితే బుధవారం ఒక్క రోజే నాలుగు వేల కేసులకు పైగా నమోదయ్యాయి. త్రిస్సూర్‌, కోహికోడ్‌, మలప్పురం జిల్లాలలో 3వేల చొప్పున జనం కోవిడ్‌ బారినపడ్డారు. గత కొన్ని రోజులుగా కేరళలో పెద్ద మొత్తంలో డెయిలీ కేసులు నమోదవుతున్నాయి. వారం రోజుల సరాసరి టెస్ట్‌ పాజిటివిటీ రేటు 17.13 గా వుంది. మరణాల రేటు 0.5శాతం.

తీవ్ర ఆంక్షలు, లాక్‌డౌన్ల మధ్య కూడా ఈ స్థాయిలో కరోనా వ్యాప్తి చెందటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో టెస్టుల సంఖ్య మరింత పెంచి వారిని ఐసోలేట్‌ చేసేలా ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. వీలైనంత తొందరగా వారిని ఐసోలేట్‌ చేయటం వల్ల వారి నుంచి మరొకరికి కరోనా సోకకుండా అరికట్ట వచ్చని కేరళ సర్కార్‌ బావిస్తోంది. టెస్ట్ పర్‌ మిలియన్‌ బై కేస్‌ పర్‌ మిలియన్‌ అన్న సైన్స్‌ సూత్రాన్ని ప్రభుత్వం అనుసరిస్తుందని కేరళ ఆరోగ్య మంత్రి అంటున్నారు. కేసులు పెరగటం వల్ల పరీక్షలు కూడా టెస్టుల కూడా పెరుగుతాయి. కేరళలో కొత్తగా 215 మంది కోవిడ్‌ బారిన పడి కన్ను మూశారు. దాంతో అక్కడ మొత్తం మృతుల సంఖ్య 19,972కు చేరింది. ఇదిలావుంటే , కొత్త కేసుల్లో 123 మంది ఆరోగ్య కార్యకర్తలు కూడా ఉన్నారు. కరోనా అనుమానంతో నాలుగు లక్షల మందిని హోం క్వారంటైన్‌ చేశారు. కాగా రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 26 వేల 582 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.

కేస్‌ లోడ్‌ ఉన్నట్టుండి 30 వేలు దాటటం ఓనమ్‌ సెలబ్రేషన్సే పుణ్యమే. ఈ పండుగ తరువాత టెస్టు పాజిటివిటీ రేటు 20 శాతం దాటుతుందని మెడికల్‌ ఎక్స్‌పర్ట్స్‌ ముందే వార్నింగిచ్చారు. గత నెలలో బక్రీద్ సమయంలో కూడా ఇలాగే జరిగింది. అప్పుడు రోజుకు 20వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇదిలావుంటే, సెకండ్ వేవ్ బీభత్సం నుంచి దేశం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. కొద్ది రోజులుగా కేసుల్లో స్థారత్వం కనిపిస్తోంది. నిత్యం 35 వేలకు కాస్త అటు ఇటుగా నమోదవుతున్నాయి. అయితే కేరళలో కేసుల సంఖ్య భారీగా పెరగటం, కర్నాటకలో పిల్లలపై అధిక ప్రభావం కనిపించటం థర్డ్‌ వేవ్‌ భయాలను మరింత ఎక్కువ చేస్తున్నాయి. ఈ సమయంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ -NIDM కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ లో కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభమవుతుందని ఆ సంస్థ నిపుణులు కేంద్రానికి నివేదిక ఇచ్చారు. ఈసారి పిల్లలే ఎక్కువగా కరోనా బారిన పడే అవకాశం ఉన్నందున తగిన ముందు ఏర్పాట్లు చేయాలని సూచించింది. ప్రస్తుతం ఉన్న వైద్య సదుపాయాలు సరిపోవని , వైద్య పరికరాలు, వెంటిలేటర్లు, అంబులెన్స్‌ల సంఖ్యను పెంచాలని నివేదికలో సూచించారు.

మరోవైపు, కరోనా వైరస్ థర్డ్ వేవ్‌ని సమర్థవంతంగా అడ్డుకునేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ స్పీడ్‌ పెంచింది. గత నెల కన్నా ఈ నెలలో టీకా డోస్‌లు పెరిగాయి. ఇప్పుడు ప్రతి రోజు 50 లక్షల మందికి పైగా టీకాలు వేస్తున్నారు. జూలైలో ఈ సంఖ్య 45 లక్షలు కూడా దాటలేదు. ఇక జూన్‌లో ప్రతీరోజూ 40 లక్షల మందికి టీకాలు వేశారు. మేలో ఈ సంఖ్య 20 లక్షలుగా ఉంది. దీన్ని బట్టి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఏస్తాయిలో వేగవంతమైందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద దేశంలో ఇప్పటి వరకు దాదాపు 60 కోట్ల మందికి కనీసం ఒక్క డోస్‌ ఇచ్చారు.

మరోవైపు, భారత్‌లో కరోనాకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్టులు ఓ షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. దేశంలో కరోనా స్థానిక స్థాయికి చేరినట్లు కనిపిస్తోందని WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. ఇది నిజంగా షాకింగ్‌ విషయమే..అదెలా అంటే జలుబు, జ్వరం, దగ్గు ఎలాగైతే కామనో..ఇక కరోనా కూడా అంతే అన్నమాట. ఇక ఎప్పటికీ అది దేశం విడిచి పోదు. సో అదీ మనం కలిసి బతకటం తప్ప వేరే మార్గం లేదు. గత ఏడాదిన్నరగా దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చినట్టు సౌమ్యా స్వామినాథన్‌ అంటున్నారు.

మరోవైపు, తెలుగు రాష్ట్రాలలో కేసులు కాస్త పెరిగాయి. కొద్ది రోజుల నుంచి కొత్త కేసులు కాస్త అటు ఇటుగా స్థిరంగా ఉంటున్నారు. ఏపీలో నిత్యం వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో మాత్రం మూడు నుంచి నాలుగు వందల మధ్య కొత్త కేసులు నమోదవుతున్నాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో నమోదవటం నగరవాసులకు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా వందకు పైగా కొత్త కేసులు రిజిస్టర్‌ అయ్యాయి. కాబట్టి హైదరాబాద్‌ జంటనగరాల వాసులు తగు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉంటే మంచింది.!!