Car Crash: హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి నేరుగా టాలీవుడ్ నటుడు ధర్మ నివాసంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి గేటు, ప్రహారీ గోడ ధ్వంసమయ్యాయి. అయితే ఇంట్లో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న యువకులు అతివేగంగా వాహనాన్ని నడపడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు రోడ్డుపై నుంచి నేరుగా నటుడు ధర్మ ఇంటి ప్రాంగణంలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఘటన సమయంలో కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ధర్మ కుటుంబ సభ్యులు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని కారులో ఉన్న యువకులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
ప్రమాదానికి గల అసలు కారణాలను పోలీసులు అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. కారు ఎంత వేగంతో ప్రయాణించింది.? డ్రైవర్ మద్యం సేవించాడా లేదా అనే విషయాలను నిర్ధారించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అలాగే ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. డ్రైవర్‌పై ఏయే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారనే విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

