Supreme Court: చైల్డ్ కేర్ లీవ్‌పై సుప్రీం కోర్టు వికలాంగ పిల్లల సంరక్షణకు సెలవు ఇవ్వకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రమైన అంశంగా పరిగణించింది. వికలాంగ బిడ్డను చూసుకునే తల్లికి శిశు సంరక్షణ సెలవును నిరాకరించడం శ్రామికశక్తిలో మహిళల సమాన భాగస్వామ్యాన్ని నిర్ధారించే రాష్ట్ర రాజ్యాంగ విధిని ఉల్లంఘించడమేనని సోమవారం పేర్కొంది.
వికలాంగులైన పిల్లలతో పనిచేసే మహిళలకు చైల్డ్ కేర్ లీవ్ (సీసీఎల్) మంజూరు చేసే అంశంపై విధాన నిర్ణయం తీసుకోవడానికి హిమాచల్ ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. పిటిషన్‌లో తీవ్రమైన అంశం లేవనెత్తబడిందని, శ్రామికశక్తిలో మహిళలు పాల్గొనడం ప్రత్యేక హక్కు కాదని, రాజ్యాంగపరమైన అవసరం అని, ఆదర్శవంతమైన యజమానిగా ఉన్న రాష్ట్రానికి ఇది తెలియదని పేర్కొంది. ఈ కేసులో కేంద్రాన్ని పార్టీగా చేర్చి, దానిపై నిర్ణయం తీసుకునేందుకు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సహాయం కోరాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పిటిషనర్ మహిళ హిమాచల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. పిటిషనర్ మహిళ (రాష్ట్రంలో భౌగోళిక విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు)కు సీసీఎల్ మంజూరు చేయాలనే పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర అధికారులను కోర్టు ఆదేశించింది.
వారి కుమారుడు జన్యుపరమైన రుగ్మతతో బాధపడుతున్నాడు. పుట్టినప్పటి నుండి అనేక శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. ఆమె కొడుకు చికిత్స కొరకు సీసీఎల్ అప్లై చేయగా.. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనల కారణంగా ఆమె సీసీఎల్‌ను తిరస్కరించబడింది. ఈ క్రమంలోనే ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. అటువంటి సెలవులను తిరస్కరించడం వల్ల పని చేసే తల్లి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టవలసి వస్తుందని, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలతో ఉన్న స్త్రీకి ఇది చాలా ముఖ్యమైనదని ధర్మాసనం పేర్కొంది. వికలాంగుల హక్కుల చట్టం, 2016కి అనుగుణంగా సీసీఎల్‌పై విధానాన్ని సవరించాలని బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ కమిటీలో చీఫ్ సెక్రటరీతో పాటు రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కూడా ఉంటారని, జూలై 31లోగా సీసీఎల్ ఏ అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.