NTV Telugu Site icon

Business Headlines 23-02-23: ఫ్లిప్‌కార్ట్‌.. ఇంక్రిమెంట్లు కట్‌. మరిన్ని వార్తలు

Business Headlines 23 02 23

Business Headlines 23 02 23

Business Headlines 23-02-23:

హైదరాబాద్‌ టు బ్యాంకాక్‌

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్‌కి నేరుగా విమానాలను ఇప్పటికే థాయ్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ నడుపుతుండగా ఇప్పుడు మరో కంపెనీ ఈ సర్వీసును ప్రారంభించింది. నోక్‌ ఎయిర్‌ అనే సంస్థ హైదరాబాద్‌ నుంచి బ్యాంకాక్‌లోని డాన్‌ ముయాంగ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కి నిన్న బుధవారం కొంత మంది ప్రయాణికులను చేరవేసింది. ఈ మేరకు బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 8 అనే విమానాన్ని వినియోగించింది. నోక్‌ ఎయిర్‌ కంపెనీ థాయ్‌లాండ్‌ మార్కెట్‌లోకి ఇటీవలే ప్రవేశించిన చౌక ధరల విమానయాన సంస్థ కావటం గమనించాల్సిన విషయం.

డీసీజీఐకి నూతన అధిపతి

డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా.. DCGIకి.. కొత్త డైరెక్టర్‌ జనరల్‌గా డాక్టర్‌ రాజీవ్‌ సింగ్‌ రఘువంశీ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ నియామకాల కమిటీ అంగీకారం తెలిపింది. ఈయన ఇప్పటి నుంచి రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తి చేసే ఔషధాలు.. నాణ్యతకు మరియు ప్రమాణాలకు తగ్గట్లుగా ఉన్నాయా లేవా అనేది ధ్రువీకరించి వాటి వాడకానికి పర్మిషన్‌ ఇవ్వటంలో DCGI కీలక పాత్ర పోషిస్తుందనే సంగతి తెలిసిందే. కొత్త మందులకు మరియు క్లినికల్‌ పరీక్షలకు అనుమతి కూడా ఈ సంస్థే ఇస్తుంది. DCGI ప్రస్తుత డైరెక్టర్‌ జనరల్‌ సోమానీ రిటైర్‌ కావటంతో కొత్త నియామకం జరిగింది.

పర్మనెంట్‌ అంటే కష్టమే

సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా.. సెబీలో పేర్లు నమోదు చేసుకున్న కంపెనీల బోర్డుల్లో ఇకపై ఎవరూ కూడా పర్మనెంట్‌ డైరెక్టర్లుగా కొనసాగే సూచనలు కనిపించట్లేదు. ఎందుకంటే.. బోర్డు మెంబర్లుగా లాంగ్‌ టర్మ్‌ కంటిన్యూ కావాలంటే ఐదేళ్లకోసారి షేర్‌ హోల్డర్ల అనుమతి తీసుకోవాల్సి రావొచ్చు. ఈ మేరకు సెబీ ఒక ప్రతిపాదన సిద్ధం చేసింది. డిష్‌ టీవీ గత ప్రమోటర్లకు మరియు ఎస్‌ బ్యాంక్‌కు మధ్య గతేడాది తలెత్తిన వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రపోజల్‌ పెట్టింది. కొంత మంది వాటాదార్లకు బైండింగి అగ్రిమెంట్లు, ప్రత్యేక హక్కుల విషయంలో కూడా సెబీ కీలక ప్రతిపాదనలు చేసింది.

సరుకులు మరింత భారం

వచ్చే రెండు నెలల్లో నిత్యావసరాల ధరలు 3 నుంచి 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు పలు కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. పెరిగిన ద్రవ్యోల్బణం మరియు క్షీణించిన రూపాయి విలువ ప్రభావాలను వినియోగదారులపై వేయాలని సంస్థలు భావిస్తున్నాయి. పాల ఉత్పత్తులు, డెయిర్‌ ప్రొడక్టులు, వాషింగ్‌ మెషిన్లు, ఫ్రిజ్‌లు, ఏసీలు, కాస్మెటిక్స్‌, పర్సనల్‌ హైజీన్‌ ప్రొడక్టులు, రెడీమేడ్‌ బట్టల రేట్లు పెరిగొచ్చని చెబుతున్నారు. 3 నుంచి 10 శాతం వరకు పెరగటం అనేది పెద్ద విషయం కాదని, గడచిన రెండేళ్లతో పోల్చితే చాలా తక్కువని వివిధ కంపెనీల ఉన్నత ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

అదానీకి శ్రీలంక ఊరట

కొద్దిరోజులుగా బ్యాడ్‌ టైమ్‌ నడుస్తున్న గౌతమ్‌ అదానీకి గుడ్‌ న్యూస్‌. ఆయన ఆధ్వర్యంలోని అదానీ గ్రీన్‌ విండ్‌ పవర్‌ ప్లాంట్లకు శ్రీలంక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విద్యుత్‌ ప్లాంట్లను 442 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటుచేయనున్నారు. వీటికి శ్రీలంక ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డ్‌ అంగీకరించింది. గడచిన ఏడాది కాలంగా ఆ దేశంలో విద్యుత్‌ కోతలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. థర్మల్‌ పవర్ ప్రొడక్షన్‌లోను మరియు బొగ్గు నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేయటంలోను శ్రీలంక అష్టకష్టాలు పడుతోంది. దీంతో డిమాండ్‌కి తగ్గట్లు సప్లై లేదు. ఈ లోటును భర్తీ చేసేందుకు అదానీ గ్రీన్‌ సంస్థ 2 పవర్‌ ప్లాంట్లను నిర్మించనుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో సీనియర్లకు

ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలో ఈసారి 4 వేల 500 మంది సీనియర్‌ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఇవ్వకూడదని నిర్ణయించారు. మొత్తం స్టాఫ్‌లో వీళ్లు దాదాపు 30 శాతం మంది ఉంటారు. మేనేజర్ల నుంచి వైస్‌ ప్రెసిడెంట్ల వరకు ఈ కఠిన నిర్ణయం వర్తిస్తుంది. ఇదిలాఉండగా.. మిగిలిన 70 శాతం మందికి.. అంటే.. 10 వేల 500 మందికి మాత్రం ఇంక్రిమెంట్లు ఇస్తారు. వీళ్లంతా మేనేజర్‌ లెవల్‌కి కింది స్థాయివాళ్లు. ఆర్థిక మందగమన ప్రభావం నుంచి తప్పించుకోవటానికి కంపెనీలు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. లేఆఫ్‌లు, ఆఫీసుల మూసివేతలు, సీఈఓల శాలరీ కటింగ్‌లు, ఫ్రెషర్స్‌ పేప్యాకేజీలో సగానికి సగం కోతలు పెడుతున్నాయి.