Fake Baba: మీ జాతకం బాగాలేదని, శాంతి పూజలు చేయాలంటూ ఓ మహిళ ను బెదిరించి… అందిన కాడికి బంగారంతో ఉడాయించిన ఓ బురిడీ బాబాను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఎర్పాటు చేసిన సమావేశంలో అడిషనల్ డీసీపీ నరసయ్య తో కలిసి ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వివరాలను వెల్లడించారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న గీత ఇటీవల భర్తను కోల్పోయింది. భర్త లెక్చరర్ గా పని చేసిన దిల్షుఖ్ నగర్ లోని వశిష్ఠ జూనియర్ కాలేజీలో రిసెప్షనిస్ట్ గా పని చేస్తుంది. గత ఏడాది భర్త మరణించడం , కూతురు ఎంబీబీఎస్ చదువుతుండటం… ఒకదాని వెంట ఇంకో సమస్యలు తలెత్తాయి. దీనితో ఆమె పనిచేస్తున్న కాలేజీ ప్రిన్సిపాల్ సూచన మేరకు గుంటూరు కు చెందిన అరిగెల శాంభశివుడు అలియాస్ గురిజీ శివస్వామిను దిల్షుఖ్ నగర్ లో కలిసింది. బాధిత మహిళ కూతురి జాతకం బాగాలేదని… ఆమె పెళ్లి అయ్యాక ఆత్మహత్య లేదా హత్యకు గురయ్యే అవకాశం ఉందని బురిడీ బాబా బెదిరించారు. శాంతి పూజలు చేస్తే దోషం పరిహారం అవుతుందన్నారు. దీనితో భయపడిన బాధిత మహిళ బురిడీ బాబా కు మొదట 1 లక్ష 70 వేలు ముట్టజెప్పింది. ఇంకా పూజలు చేయాలనీ బెదిరిస్తూ ఆమె వద్ద నుండి 26 తులాల బంగారాన్ని తీసుకున్నాడు. అలాగే వాళ్ళు ఉంటున్న ఇంటి డాక్యుమెంట్ లను తీసుకొని , పూజ పేరిట శ్రీకాళహస్తి కు తీసుకెళ్లి అక్కడ పూజ నిర్వహించాడు.
ఈ సమయంలో బాధిత మహిళ గీత తో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన ఆమె కూతురు తిరిగి హైదరాబాద్ వచ్చాక వారి ఇంటి డాక్యుమెంట్ లను వెనక్కు తీసుకొని , వారు ఇచ్చిన బంగారాన్ని తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేసింది. బురిడీ బాబా హైదరాబాద్ నుండి పరారయ్యాడు. దీనితో బాధిత మహిళ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాచిగూడ ఇన్స్పెక్టర్ ఝాన్సీ , డిఐ సురేష్ , ఎసై నరేష్ లు కేసు నమోదు చేసి , బురిడీ బాబా పై నిఘా పెట్టారు. ఈ నెల 12న తిరుపతి నుండి హైదరాబాద్ కు వచ్చిన శాంభశివుడు ను అదుపులోకి తీసుకొని విచారించారు. గతంలో ప్రేవేట్ ల్యాండ్ సర్వేయర్ గా పని చేసిన శాంభశివుడు అక్కడ వచ్చే డబ్బులు సరిపోక , ఈ బాబా అవతారం ఎత్తినట్లు విచారణలో తేలింది. అతని వద్ద నుండి 20.5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. రెండు తులాల బంగారం బ్యాంక్ లో తాకట్టు పెట్టారని… మిగిలి బంగారం అమ్ముకున్నట్లు డీసీపీ తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి , రిమాండ్ కు తరలించినట్లు వివరించారు. ప్రజలు ఇలాంటి బురిడీ బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు.
Congress: “సంఘటన్ సుజన్ అభియాన్” ప్రారంభం.. సంస్థాగత ప్రక్షాళనకు కాంగ్రెస్ శ్రీకారం..