Budget 2026 Tax Expectations: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2026పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశ పెట్టే బడ్జెట్‌పై పూర్తిస్థాయిలో ఎక్సైజ్ చేస్తున్నారు.. ఈ సారి అన్ని వర్గాలు ఈ బడ్జెట్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నాయి. గత బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.12 లక్షలకు పెంచడం ద్వారా ప్రభుత్వం మధ్యతరగతికి ఊరట కల్పించింది. ఇప్పుడు, ఈసారి బడ్జెట్‌లో వివాహితులకు ఉమ్మడి పన్ను (Joint Taxation) విధానం అమలుపై పరిశీలన జరుగుతోందన్న వార్తలు ఆసక్తికరంగా మారాయి.
ఉమ్మడి పన్ను విధానం అంటే ఏమిటి?
ఉమ్మడి పన్ను విధానం అనేది భార్యాభర్తలను విడివిడిగా కాకుండా ఒకే ఆర్థిక యూనిట్‌గా పరిగణించి పన్ను విధించడం. ఈ విధానం అమలులోకి వస్తే, భార్యాభర్తల ఉమ్మడి ఆదాయాన్ని కలిపి పన్ను లెక్కిస్తారు. భారతదేశంలో ఇప్పటివరకు పన్ను విధానం పూర్తిగా వ్యక్తిగత ఆదాయంపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం భార్యాభర్తలు వేర్వేరు పాన్ కార్డులతో వేర్వేరు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి వస్తోంది. దీనివల్ల కుటుంబానికి ప్రత్యక్షంగా వచ్చే పన్ను ప్రయోజనం చాలా తక్కువగా ఉంది.
ప్రస్తుత విధానంలో లోపాలు
ప్రస్తుత పన్ను వ్యవస్థలో అతిపెద్ద లోపం ఏమిటంటే, ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే సంపాదిస్తే, మరొకరి ప్రాథమిక పన్ను మినహాయింపు ప్రయోజనం వృథా అవుతోంది. ఫలితంగా, ఆ కుటుంబం ఒకే ఆదాయంపై అధిక పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఈ పరిస్థితి ముఖ్యంగా ఒకే ఆదాయంతో నడిచే మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారుతోంది. భార్యాభర్తలలో ఒకరు ఉద్యోగం చేయకపోయినా, ఆ కుటుంబానికి అదనపు పన్ను ప్రయోజనాలు అందడం లేదు.
ఉమ్మడి పన్నుతో లాభాలేంటి?
ఉమ్మడి పన్ను విధానం అమలైతే, పన్ను స్లాబ్‌లను సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.. ప్రాథమిక మినహాయింపు పరిమితి పెరిగినట్లే అవుతుంది.. గృహ రుణాలు, ఆరోగ్య బీమా, వైద్య ఖర్చులపై ఉన్న తగ్గింపులను పూర్తిగా వినియోగించుకోవచ్చు.. ఇద్దరూ సంపాదించే దంపతులకు వేర్వేరు ప్రామాణిక తగ్గింపులు వర్తించే అవకాశం ఉంటుంది.. అయితే, అమెరికా, జర్మనీ సహా పలు దేశాల్లో ఇప్పటికే కుటుంబాన్ని ఒకే ఆర్థిక యూనిట్‌గా పరిగణించే పన్ను విధానం అమలులో ఉంది. ఈ నమూనాను భారత్‌లో ప్రవేశపెడితే, పన్ను వ్యవస్థ మరింత సమానత్వంతో పాటు న్యాయంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సర్‌ఛార్జ్‌పై ఉపశమనం దక్కుతుందా?
ప్రస్తుతం రూ.50 లక్షలకుపైగా ఆదాయం ఉన్నవారిపై సర్‌ఛార్జ్ విధించబడుతోంది. ఉమ్మడి పన్ను విధానం అమలైతే, ఈ పరిమితిని రూ.75 లక్షలు లేదా అంతకంటే ఎక్కువకు పెంచే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇది ఉన్నత మధ్యతరగతి మరియు అధిక ఆదాయ కుటుంబాలకు గణనీయమైన ఊరట కలిగించవచ్చు. అయితే, బడ్జెట్ 2026లో ప్రభుత్వం నిజంగా ఉమ్మడి పన్ను విధానాన్ని ప్రవేశపెడితే, ఇది భారతదేశ పన్ను చరిత్రలో దశాబ్దాల తర్వాత జరిగే అతిపెద్ద సంస్కరణగా నిలిచే అవకాశం ఉంది. వివాహితులకు ఇది నిజంగా శుభవార్తగా మారుతుందా? లేక అంచనాలకే పరిమితమవుతుందా? అన్నది బడ్జెట్ రోజున తేలనుంది.
