NTV Telugu Site icon

Budget 2025: బడ్జెట్‌లో మాల్దీవులకు పెరిగిన సాయం.. భూటన్, ఆఫ్ఘన్, బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటంటే.?

Pm Modi

Pm Modi

Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025లో విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) విదేశీ దేశాలకు సహాయం కోసం రూ. 5,483 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది రూ. 5806 కోట్లతో పోలిస్తే కాస్త తక్కువ. విదేశాంగ శాఖకు కేటాయించిన మొత్తం బడ్జెట్ రూ. 20,516 కోట్లుగా ఉంది. దీని నుంచే మన పొరుగు, మిత్ర దేశాలకు భారత్ సాయాన్ని అందిస్తోంది.

అగ్రస్థానంలో భూటాన్:

భారత సన్నిహిత మిత్రదేశం భూటాన్‌కి విదేశీ సాయంలో అగ్రతాంబూలం లభించింది. 2025-26కి గానూ రూ. 2,150 కోట్లు కేటాయించింది. గతేడాది భూటాన్‌కి రూ. 2543 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత్ ఇస్తున్న సాయం తగ్గింది. తగ్గినప్పటికీ, భారతదేశం భూటాన్ యొక్క ప్రాథమిక అభివృద్ధి భాగస్వామిగా కొనసాగుతోంది. మౌలిక సదుపాయాలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు, ఆర్థిక సహకారానికి నిధులు కేటాయిస్తోంది.

మాల్దీవులకు పెరిగిన సాయం:

మాల్దీవులకు భారత్ విదేశీ సాయాన్ని పెంచింది. మాల్దీవులు కొత్త అధ్యక్షుడిగా మహ్మద్ ముయిజ్జూ ఎన్నికైన తర్వాత భారత్ వ్యతిరేక వైఖరిని అవలంభించాడు. అయితే, భారత పర్యాటకులు అక్కడికి వెళ్లకపోవడంతో మాల్దీవులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి చేరింది. ఆ సమయంలో మళ్లీ భారత సాయాన్ని కోరింది. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో మల్దీవులకు భారత్ రూ. 600 కోట్ల విదేశీ సాయాన్ని ప్రకటించింది. గతేడాది రూ. 400 కోట్ల కన్నా ఇది ఎక్కువ. చైనా అనుకూల వైఖరి నుంచి భారత్‌తో మళ్లీ సంబంధాలు పునరుద్ధరించుకుంటున్న నేపథ్యంలో మాల్దీవులకు సాయం పెంచింది.

ఆఫ్ఘనిస్తాన్‌కి సాయం రెట్టింపు..

ఆఫ్ఘనిస్తాన్‌కి ఇస్తున్న సాయాన్ని భారత్ రెట్టింపు చేసింది. తాలిబాన్ పాలనలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ దేశానికి రూ. 50 కోట్ల నుంచి సాయాన్ని రూ. 100 కోట్లకు పెంచింది. రెండేళ్ల క్రితం ఈ సాయం రూ. 207 కోట్లుగా ఉంది. దీనితో పోలిస్తే ఓవరాల్‌గా సాయంలో కొత పడినట్లే. ఇటీవల కాలంలో తాలిబాన్ ప్రభుత్వం ఇండియా అనుకూల వైఖరితో ఉంది. భారత సీనియర్ దౌత్యవేత్త విక్రమ్ మిస్రీ దుబాయ్‌లో తాలిబాన్ అధికారులతో సమావేశయ్యారు. మరోవైపు తాలిబాన్‌కి పాకిస్తాన్‌కి పడటం లేదు. ఇరాన్‌లో భారత్ చాబహార్ పోర్టుని అభివృద్ధి చేస్తో్ంది. పాకిస్తాన్‌ని కాదని, మిడిల్ ఈస్ట్, మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్యం పెరగాలంటే ఆఫ్ఘనిస్తాన్ చాలా కీలకం. ఈ మేరకు భారత్-ఆఫ్ఘన్ బంధం బలపడుతోంది.

మయన్మార్‌కి తగ్గిన సాయం:

సైనిక జుంటా పాలనలో ఉన్న మన సరిహద్దు దేశం మయన్మార్‌కి భారత్ సాయాన్ని తగ్గించింది. సవరించిన 2024-25 కేటాయింపులతో పోలిస్తే ( రూ. 400 కోట్లు) నుంచి తాజా బడ్జెట్‌లో 2025-26లో రూ. 350 కోట్లు మాత్రమే భారత్ సాయాన్ని అందించనుంది.

ఇతర దేశాలకు కేటాయింపులు చూస్తే..

నేపాల్‌కు భారతదేశం తన కేటాయింపులను రూ.700 కోట్లుగా కొనసాగించింది. సంక్షోభంలో చిక్కుకున్న దక్షిణ పొరుగు దేశం ఆర్థిక మాంద్యం నుండి కోలుకుంటున్నందున శ్రీలంకకు కేటాయింపులు రూ.300 కోట్లుగానే ఉన్నాయి. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ దేశానికి రూ. 120 కోట్లు కేటాయించింది. ఆఫ్రికన్ దేశాలకు సహాయం గత సంవత్సరం రూ.200 కోట్ల నుండి రూ.225 కోట్లకు పెరిగింది. టిన్ అమెరికా కేటాయింపు రూ.90 కోట్ల నుండి రూ.60 కోట్లకు తగ్గించబడింది.