Site icon NTV Telugu

Srinivas Goud: ఎన్నికల హామీలను కాంగ్రెస్‌ మరిచిపోయింది

Srinu

Srinu

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిపోయిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా మానకొండుర్‌లో ఎండిన పంటలకు ఎకరానికి 25 వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రైతు దీక్ష కార్యక్రమం చేపట్టింది., మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, రసమయి బాలకిషన్, పలువురు నేతలు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కరవు వచ్చిందని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ల పాటు కరవు రాలేదన్నారు. గత పదేళ్లలో రైతులకు కష్టాలు రాలేదని.. కాంగ్రెస్‌ వచ్చిన వంద రోజుల్లోనే కష్టాలు వచ్చి పడ్డాయని ధ్వజమెత్తారు. అసత్య ప్రచారాలతో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిందని పేర్కొన్నారు. కర్ణాటకలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? కాంగ్రెస్‌ను గద్దె దింపుదామా అని ఎదురుచూస్తున్నారన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

ఎండిన పంటలకు నష్టానికి ఎకరానికి రైతులకు రూ.25000 వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రకారం యాసంగి సీజన్ నుంచి రైతులకు 500 బోనస్ ఇవ్వాలని కోరారు. చివరి దశలో ఉన్న పంటలను కాపాడేందుకు రైతులకు సాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే తక్షణమే రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయాలని కోరారు. రైతుల పక్షాన ముందు ముందు ఏ పోరాటానికైనా బీఅర్ఎస్ నాయకులు కార్యకర్తలు సిద్దంగా ఉన్నారని నాయకులు ప్రకటించారు.

Exit mobile version