Site icon NTV Telugu

OTR: బిఆర్ఎస్ ఎమ్మెల్యే & కాంగ్రెస్ సీనియర్ నేత కలసి ఇసుక దందా..!!

Otr

Otr

OTR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఒకరు అడ్డగోలుగా ఇసుక దందా చేస్తున్నారన్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అదీ కూడా… ఏదో చాటుమాటుగానో… అడపాదడపానో కాకుండా…. రాజమార్గంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే అలా ఎలా చేయగలుగుతున్నారంటూ హాట్‌ హాట్‌ డిస్కషన్స్‌ నడుస్తున్నాయి. విషయం తెలిసి అధికార కాంగ్రెస్‌ నాయకులే అవాక్కవుతున్నారట. నిత్యం వందలాది లారీల ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా రవాణా చేస్తూ… సదరు ఎమ్మెల్యే కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఇక్కడ ఇంకో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే… ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే సందు దొరికితే చాలు… రాష్ట్ర ప్రభుత్వం మీద, సీఎం రేవంత్‌రెడ్డి మీద విరుచుకుపడుతుంటారు. సంచలన వ్యాఖ్యలు, చర్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తుంటారు. బీఆర్ఎస్‌ వేదికల మీద కూడా కాంగ్రెస్‌ పార్టీ అంటే అసలు లెక్కే లేనట్టు మాట్లాడుతూ సీఎంను పరుష పదజాలంతో విమర్శిస్తుంటారట.

READ ALSO: OTR: టీడీపీ, వైసీపీ రాజకీయాల మధ్య తిరుమల దర్శనాల వివాదం!

అవకాశం దొరికిన ప్రతీసారి హస్తం పార్టీని ఆడేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో సదరు ఎమ్మెల్యే చేసిన ఓ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అలాంటి నాయకుడు… కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇంత అడ్డగోలుగా ఇసుక దందా చేస్తున్నారంటే… ప్రభుత్వంలోని ఎవరి సపోర్ట్‌ లేకుండానే అదంతా జరుగుతోందా అన్న డౌట్స్‌ వస్తున్నాయట జిల్లాలో ఎక్కువ మందికి. సాధారణంగా ప్రతిపక్ష నాయకులు ఇలాంటి పనులు చేస్తుంటే… పవర్‌లో ఉన్న వాళ్ళు ఊరుకోరు. అధికారులు కూడా పవరాస్త్రాలకు పదును పెడుతుంటారు. కానీ… ఈ ఎమ్మెల్యే విషయంలో వాళ్ళు, వీళ్ళు అంతా… కలగలిసి మాకేం తెలియదు, మేమేం చూడలేదన్నట్టు మౌనం పాటించడం వెనక పెద్ద వ్యవహారాలే నడుస్తున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ హయాంలో జిల్లా పరిధిలోని మానేరు నదిపై ఉన్న అన్ని ఇసుక క్వారీల్లో వేలుపెట్టిన ఆ లీడర్ తాను ఎమ్మెల్యే అయిన కొత్తలో కాస్త తగ్గి… దందాకి కాస్త దూరం జరిగారట.

కానీ… ఈ మధ్య కాలంలో ఆయనకు ఓ కొత్త ఐడియా వచ్చి వెంటనే అమల్లో పెట్టేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇంకా ప్రారంభం కాని ర్యాంప్‌తో పాటు… జిల్లాకు చెందని ఓ వ్యక్తి లీజుకు తీసుకుని కొంతకాలంగా తవ్వకాలు నిలిపివేసిన ర్యాంప్‌లో దర్జాగా దందా స్టార్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. తన వ్యవహారాలకు అడ్డుపడకుండా…. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడి సాయం కోసం సంప్రదించి సక్సెస్‌ అయినట్టు తెలిసింది. ఎమ్మెల్యే గారి ఆఫర్స్‌ సదరు కాంగ్రెస్‌ సీనియర్‌కు తెగ నచ్చేయడంతో లైన్‌ క్లియరైపోయిందట. ఆ సీనియర్‌ కూడా రాష్ట్ర స్థాయి పదవి ఉన్న నేత కావడంతో… అధికారులు సైతం కమ్‌ కమ్‌ వెల్కమ్‌ అన్నట్టు సమాచారం. ఇంకేముంది… ఆల్‌గుడ్‌ అనుకుంటూ ఇంతకు ముందు పక్కకు పెట్టిన ఎమ్మెల్యే అనుచరుల వాహనాలు ఇసుక లోడ్స్‌తో రయ్‌ రయ్‌మని దూసుకెళ్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదంతా పై స్థాయిలో జరగడంతో… విషయం తెలియని కొందరు కింది లెవల్‌ అధికారులు చర్యలకు సిద్ధం కావడంతో… సదరు కాంగ్రెస్‌ రాష్ట్ర స్థాయి నేత వైపు నుంచి ఫోన్‌కాల్స్‌ వెళ్ళాయన్న టాక్‌ ఉంది. ఈ విషయం అనోటా ఈనోటా జిల్లా నుంచి హైదరాబాద్‌కు చేరిందట. దాంతో ఎమ్మెల్యే ఇల్లీగల్‌ దందా వెనక ఆ కాంగ్రెస్‌ సీనియర్‌ పాత్ర ఎంత? పార్టీలకు అతీతంగా ఇద్దరూ నిజంగానే ఏక్‌ దూజే కే లియే అంటున్నారా లేక అధికారులతో దురుసుగా వ్యవహరిస్తాడనే పేరున్న ఎమ్మెల్యేనే గడుసుగా కాంగ్రెస్‌ నాయకుడి పేరు వాడుతున్నారా అన్న విషయంలో ఆరా తీస్తున్నట్టు సమాచారం. మొత్తానికి పైకి కారాలు మిరియాలు నూరుతూ కయ్యానికి కాలు దువ్వే నేతలు… కాసుల కక్కుర్తితో కలిసిపోయారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత? ప్రచారం ఎంత అన్నది ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఇంట్రస్టింగ్‌ సబ్జెక్ట్‌.

READ ALSO: Vishwak Sen: పొలిటీషియన్‌గా విశ్వక్‌సేన్.. ‘లెగసీ’ టీజర్ చూశారా!

Exit mobile version