రాఖీ పౌర్ణమి వస్తోంది..!! తమ్ముడి చేతికి రాఖీ కడతాం అనుకుంది…! కానీ.. అదే తమ్ముడి చేతుల్లో బలైందో అక్క. ప్రియుడితో అక్క అస్తమానం ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని తట్టుకోలేకపోయిన తమ్ముడు… ఏకంగా అక్క మెడకు వైర్ బిగించి చంపేశాడు. తనకేం తెలియనట్లు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. క్షణికావేశంలో కొడుకు చేసిన పనికి కూతురు బలవడమే కాకుండా.. కొడుకూ జైలు పాలయ్యాడు. కొత్తూరు పరిధిలో జరిగిన ఈ ఘటన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
ఈ యువతి పేరు రుచిత. రంగారెడ్డి జిల్లా పెంజర్లకి చెందిన దేశాల రాఘవేందర్ కూతురు. డిగ్రీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన యువకుడు దినేష్‌తో రుచిత ప్రేమలో పడింది. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం ఇరు కుటుంబాల్లో తెలిసి గొడవ జరిగింది. రెండు కుటుంబాలు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టుకున్నారు. ఇకపై దినేష్ తమ కూతురుతో మాట్లాడకూడదని.. ప్రేమ విషయం పూర్తిగా మరిచిపోవాలని తీర్మానం చేసుకున్నారు.
కొంతకాలంగా దినేష్, రుచిత దూరంగా ఉంటూ వచ్చారు. ఇద్దరి మధ్య కలుసుకోవడం.. ఫోన్‌లో మాట్లాడుకోవడం కూడా లేవు. ఇంట్లో వాళ్లు కూడా తమ కూతురు ప్రవర్తనలో మార్పు వచ్చింది అనుకున్నారు. ఈనెల 28న ఇంట్లో ఎవరూ లేని సమయంలో రుచిత ఫోన్‌లో మాట్లాడుతోంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన రుచిత తమ్ముడు రోహిత్ గమనించాడు. ఎవరితో ఫోన్‌లో మాట్లాడుతున్నావని గట్టిగా అడిగాడు. రుచిత తడబడుతూ సమాధానం చెప్పింది. అనుమానం వచ్చిన రోహిత్.. ఫోన్ లాక్కుని చూశాడు. దినేష్ తో మాట్లాడుతున్నట్లు గుర్తించి ఆగ్రహంతో ఊగిపోయాడు. క్షణికావేశంలో పక్కనే ఉన్న ఫోన్ ఛార్జింగ్ వైర్‌ను అక్క రుచిత మెడకు చుట్టి ఊపిరాడకుండా చేశాడు. క్షణాల్లో రుచిత చనిపోయింది.
ఒక్కసారిగా జరిగిన పరిణామంతో రోహిత్ కూడా షాక్ అయ్యాడు. తనకేం తెలియనట్లు ఇంట్లో నుంచి పరార్ అయ్యాడు. బయటి నుంచి వచ్చిన రుచిత పేరెంట్స్.. ఇంట్లోకి వెళ్లి చూడగా విగతజీవిలా పడి ఉంది. ఏం జరిగిందో తెలియలేదు. వైద్యులు పరీక్షించి.. అప్పటికే రుచిత చనిపోయిందని చెప్పారు. మెడకు ఉన్న గాయం, పక్కనే పడి ఉన్న ఛార్జర్ వైర్ చూసి ఎవరో మెడకు బిగించి చంపినట్లు గుర్తించారు. కొడుకు రోహిత్‌కు కాల్ చేయగా.. చిత్రవిచిత్రంగా మాట్లాడుతున్నాడు. దీంతో రోహితే ఏదో చేసి ఉంటాడని అనుమానించారు పేరెంట్స్. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రోహిత్‌ను పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో రోహిత్‌ను రిమాండ్ కు తరలించారు పోలీసులు. క్షణికావేశంలో కొడుకు చేసిన పనికి కూతురును కోల్పోయారు. కూతురును చంపి కొడుకు కూడా జైలు పాలయ్యాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.