NTV Telugu Site icon

Memantha Siddham: సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు నేడు విరామం

Jagan

Jagan

Memantha Siddham: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు నేడు విరామం ప్రకటించారు. ఇవాళ గుడివాడలో జరగాల్సిన ‘మేమంతా సిద్ధం’ సభ రేపటికి వాయిదా పడింది. తనకు అయిన గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలంటూ సీఎం జగన్‌కు వైద్యులు సూచనలు చేశారు. తదుపరి కార్యక్రమాన్ని ఆదివారం విడుదల చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ దాడి ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇక అటు రేపటి బస్సు యాత్రకు సెక్యూరిటీలో మార్పులు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. వైద్యుల సలహామేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి కేసరపల్లి క్యాంప్‌నుండి సీఎం జగన్‌ చేరుకున్నారు. అక్కడ వైద్యులు సీఎం జగన్‌ గాయానికి తదుపరి చికిత్స చేశారు. గాయానికి రెండు కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. వైద్యుల చికిత్స అనంతరం సీఎం జగన్‌ కేసరపల్లికి బయల్దేరారు. సీఎం జగన్‌తో పాటుగా వైఎస్‌ భారతీ ఉన్నారు.

Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

విజయవాడలో “మేమంతా సిద్ధం” బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి జరిగింది. అత్యంత వేగంగా వచ్చి సీఎం జగన్ కనుబొమ్మకు తాకిన రాయి.. సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం అవుతుంది. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై తీవ్ర గాయం అయింది. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి సైతం గాయం అయింది. వెంటనే సీఎం జగన్ కు బస్సులో డాక్టర్లు ప్రథమ చికిత్స అందించారు.