NTV Telugu Site icon

Teachers Transfer: టీచర్ల బదిలీలకు బ్రేక్.. ఉత్తర్వులు నిలిపివేత

Ap

Ap

Teachers Transfer: టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది.. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఉపాధ్యాయుల బదిలీల కోసం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేశారు.. ఎటువంటి బదిలీలూ చేపట్టొద్దని డీఈవోలకు ఆదేశాలు వెళ్లాయి.. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్య కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.. ఎన్నికలకు ముందు మొత్తంగా 1,800 మంది టీచర్ల బదిలీలు జరిగాయి.. అయితే, పైరవీలు, సిఫార్సులతో ఈ బదిలీలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయా.. మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఒత్తిడితో ఈ సిఫార్సులు జరిగాయనే అభియోగాలు కూడా వచ్చిన నేపథ్యంలో.. మొత్తంగా బదిలీలనే నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చింది విద్యాశాఖ.

Read Also: Janasena: టీటీడీ ఈవోపై సీఐడీకి జనసేన ఫిర్యాదు

కాగా, ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు గత ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.. బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలతో జీవో నంబర్ 47 జారీ చేసింది ప్రభుత్వం.. 2023 ఏప్రిల్‌ నాటికి 5 ఏళ్లు పూర్తి చేసుకున్న వాళ్లందరూ బదిలీలకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. మే 31, 2025 లేదా అంతకంటే ముందే ఉద్యోగ విరమణ చేసిన వారికి అభ్యర్ధన మేరకు బదిలీలు చేపట్టాలని.. 2022-23 విద్యా సంవత్సరం నాటికి ఒకే చోట అయిదేళ్ల సర్వీసు పూర్తి చేసిన గ్రేడ్ -2 ప్రధానోపాధ్యాయులు.. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఇతర ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు.. ప్రస్తుతం ఉపాధ్యాయులు ఏ మేనేజ్ మెంట్ సర్వీసులో కొనసాగుతున్నారో ఆ విభాగంలోనే బదిలీ అయ్యేలా మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చారు.. ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరించి.. వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని కూడా నిర్ణయించారు.. కానీ, మొత్తంగా టీచర్ల బదిలీలకు బ్రేక్‌ పడింది.