Brad Hogg About Sachin Tendulkar’s Test Records: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా టెస్టుల్లో 15921 పరుగులు, 51 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ ఈ రికార్డులను అధిగమించేందుకు చాలా తక్కువ మంది క్రికెటర్లే పోటీలో ఉన్నారు. అందులో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన విరాట్.. టెస్టుల్లో మాత్రం వెనకబడిపోయాడు. ఈ క్రమంలో సచిన్ రికార్డులను విరాట్ అధిగమించడం అసాధ్యమని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అన్నాడు.
బ్రాడ్ హాగ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘సచిన్ టెండూల్కర్ రికార్డులకు దరిదాపులకైనా విరాట్ కోహ్లీ వెళ్తాడని నేను అనుకోవడం లేదు. కోహ్లీ మునుపటి దూకుడును ప్రదర్శించలేకపోతున్నాడు. కోహ్లీ జోరు తగ్గింది. గత నాలుగేళ్లుగా అతడి గణాంకాలను చూస్తే అర్థమైపోతుంది. రాబోయే 10 టెస్టుల్లో భారీగా పరుగులు చేసినా సచిన్ రికార్డులను బద్దలు కొట్టడం అసాధ్యం’ అని అన్నాడు. సచిన్ టెస్టు శతకాల రికార్డుకు కోహ్లీ ఇంకా 23 సెంచరీల దూరంలోనే ఉన్నాడు. ఇక పరుగులలో దాదాపు 7 వేలకు పైగా తేడా ఉంది. విరాట్ టెస్టులో 8871 రన్స్, 29 శతకాలు బాదాడు. 2020 నుంచి ఇప్పటివరకు కేవలం రెండు సెంచరీలు మాత్రమే చేశాడు.
Also Read: IPL 2025 RCB: ముగ్గురు స్టార్లకు చెక్.. ఆర్‌సీబీ రిటెన్షన్ లిస్ట్ ఇదే!
సచిన్ టెండూల్కర్ రికార్డుకు ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ సమీపంలో ఉన్నాడు. రూట్ 146 టెస్టుల్లో 12402 రన్స్ బాదాడు. సచిన్ రికార్డుకు మరో 3500 పరుగుల దూరంలో ఉన్నాడు. టెస్టుల్లో 34 శతకాలు చేశాడు. ఇటీవలి గత రెండేళ్లుగా రూట్ ఫుల్ ఫామ్ మీదున్నాడు. పరుగుల వరద పారిస్తూ.. సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నాడు. 33 ఏళ్ల రూట్ ఇదే ఫామ్ కొనసాగిస్తే సచిన్ రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది.