NTV Telugu Site icon

Booster Dose : రేప‌టి నుంచి ఉచితంగా బూస్టర్ డోసు..

Covid Vaccine

Covid Vaccine

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. అయితే కొత్తకొత్త వేరియంట్లతో ప్రజలపై దాడిచేస్తున్న కోవిడ్‌ బాడిన పడకుండా ఉండేందుకు బూస్టర్‌ డోస్‌ ఉపయోగపడుతుందని డబ్ల్యూహెచ్‌వో అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే బూస్టర్‌ డోస్‌ పంపిణీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. అయితే.. రేప‌టి నుంచి తెలంగాణలోని ప్ర‌భుత్వ దవాఖానల్లో ఉచితంగా కొవిడ్ వాక్సిన్ బూస్ట‌ర్ డోసు పంపిణీ చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ‌ మంత్రి హరీష్‌ రావు వెల్లడించారు. రాష్ట్రంలో వాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసింది వైద్యారోగ్యశాఖ.

అర్హులైన ప్రతి ఒక్కరికీ బూస్ట‌ర్ డోస్ ఇవ్వాల‌ని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో గురువారం నుంచి 18 ఏళ్లు పైబ‌డి, రెండో డోసు నుండి 6 నెలలు పూర్త‌యిన వారికి ప్ర‌భుత్వ ద‌వాఖాన‌ల్లో ఉచితంగా బూస్ట‌ర్ డోస్ ఇచ్చేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 75 రోజుల పాటు జ‌రిగే ఈ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా అర్హులైన వారంద‌రికి బూస్ట‌ర్ డోస్ ఇచ్చేలా, త‌ద్వారా క‌రోనా నుంచి కాపాడుకునేందుకు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందించుకునేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు 60 ఏళ్లు దాటిన వారికి మాత్ర‌మే బూస్ట‌ర్ డోస్ ఇచ్చేందుకు అనుమ‌తించిన కేంద్రం.. ఈ ఏడాది ఏప్రిల్ 10 నుంచి.. 18 ఏళ్లు పైబ‌డిన వారికి బూస్ట‌ర్ డోస్ ఇచ్చేందుకు కేవ‌లం ప్రైవేటు అసుప‌త్రుల‌కు అనుమ‌తించింది.

రాష్ట్రంలో బూస్టర్ డోస్ పంపిణీకి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు:

అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బూస్టర్ డోసు అందుబాటులో ఉంటుంది.

అన్ని జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ వాక్సిన్ అందుబాటులో ఉంటుంది.

సికింద్రాబాద్, నాంపల్లి, ఖాజీపేట రైల్వే స్టేషన్లతో పాటు, మహాత్మా గాంధీ, జూబ్లీ బస్ స్టాండ్ లలో 24 గంటల పాటు సౌకర్యం ఉంటుంది.

హౌసింగ్ సొసైటీలు, ఆఫీసులు, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు, ఇతర వర్క్ ప్లేసెస్ లో వారి కోరిక మేరకు వ్యాక్సినేషన్ నిర్వహించడం జరుగుతుంది.

040-24651119 నెంబర్ లో సంప్రదిస్తే.. 100 మంది కంటే ఎక్కువ మంది లబ్దిదారులు ఉన్న చోట వాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది.

 

Show comments