Book My Show Servers Crashed due to Adipurush Advance Bookings: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆది పురుష్ మేనియానే కనిపిస్తోంది. ఈ సినిమా మరికొద్ది గంటలలో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఈ మైథాలజికల్ మూవీలో రఘురాముడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఆయన భార్య సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ నటిస్తోంది. సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేయడంతో ముందు జాగ్రత్తగా ఈ సినిమాలో విలన్ అంటే రావణాసురుడు పాత్ర కోసం ఒక బాలీవుడ్ హీరోని సైఫ్ అలీ ఖాన్ ని ఎంపిక చేసుకున్నారు. నిజానికి ఈ రామాయణ కథ దాదాపుగా అందరికీ తెలుసు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాను కచ్చితంగా ధియేటర్లలోనే చూడాలని ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రేమికులందరూ ఫిక్స్ అయిపోయారు.
Also Read: Adipurush: నార్త్ లో మెంటల్ ఎక్కిస్తున్న ఆదిపురుష్ క్రేజ్
ఈ నేపథ్యంలో ఈ సినిమా టికెట్ల కోసం ప్రేక్షకులు పడిగాపులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బుక్ మై షో, ఐనాక్స్ పివిఆర్, పేటీఎం లాంటి వెబ్సైట్లో పెట్టిన క్షణాల వ్యవధిలోనే టికెట్లు హాట్ కేకుల్లాగా అమ్ముడైపోతున్నాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లీడింగ్ టికెట్ బుకింగ్ వెబ్సైట్ అయిన బుక్ మై షోలో ఈ సినిమా టికెట్ల కోసం లాగిన్ అవుతున్న వారి సంఖ్య పెరిగిపోవడంతో వెబ్సైట్ సర్వర్లు క్రాష్ అయినట్లు తెలుస్తోంది. యాప్ లో కూడా ప్రస్తుతానికి మీరు ప్రయత్నిస్తున్న పేజీ చేరుకోలేరు అనే విధంగా మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఒకరకంగా చెప్పాలంటే సినీ అభిమానులు మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు సైతం ఈ సినిమాని థియేటర్లో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఈ రేంజ్ లో సర్వర్లు కూడా క్రాష్ అవుతున్నాయని తెలుస్తోంది. ఈ విషయంలో పలుమార్లు క్రాష్ అయిన తర్వాత బుక్ మై షో అలర్ట్ అయ్యి సర్వర్ల కెపాసిటీ పెంచుకున్నట్లుగా కనిపిస్తోంది.
Also Read: Adipurush ticket price: ‘ఆదిపురుష్’కి ప్రభుత్వాల మద్దతు.. ఏపీలో కూడా రూ.50 పెంపుకు గ్రీన్ సిగ్నల్!
ఇప్పటికే నార్త్ బెల్ట్ తో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా బుకింగ్స్ దుమ్ము రేపుతున్నాయి. ఈ బుకింగ్స్ స్పీడ్ కనక చూస్తుంటే మొదటి రోజు సంచలన వసూళ్లు సాధించే దిశగా సినిమా పరుగులు పెడుతుంది అనిపిస్తోంది. ఇప్పటికే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ సినిమా ఉంది. హిందీ వరకు పఠాన్ సినిమా నిలబడింది, ఇప్పుడు ఆ సినిమాల రికార్డులను కూడా బద్దలు కొట్టేందుకు ప్రభాస్ ఆదిపురుష్ సినిమా పరుగులు పెడుతున్నట్టుగా అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్స్ ని చూస్తే అర్థమవుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సినిమా రిలీజ్ కి దగ్గర పడుతున్నా సినిమా యూనిట్ ప్రమోషన్స్ కి మాత్రం దూరంగానే ఉంది. తిరుపతిలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఆది పురుష్ సినిమాకు సంబంధించిన పెద్ద ప్రమోషన్స్ అయితే ఏమీ జరగడం లేదు. కానీ ప్రేక్షకులలో మాత్రం ఈ మేనియా ఎక్కువగా కనిపిస్తోంది.