బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఢిల్లీలో ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు కంగనా చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేసిన సమయంలో కంగనా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగానే తాను ఈ దాడి చేసినట్లు కుల్విందర్ కౌర్ చెప్పారు. ఈ ఘటనపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన కంగనా.. తర్వాత తన పోస్టులో కొంతభాగాన్ని డిలీట్ చేశారు.
తనపై జరిగిన దాడి ఘటనపై కంగనా రనౌత్ ఎక్స్‌లో స్పందిస్తూ.. తాను బాగానే ఉన్నట్లు ఓ వీడియోను విడుదల చేశారు. ‘సెక్యూరిటీ చెకింగ్ పూర్తయి బోర్డింగ్ పాస్ కోసం వేచి చూస్తుండగా.. ఓ సీఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ మహిళా ఆఫీసర్ నా వైపు వచ్చి కొట్టింది. నన్ను దూషించింది. ఎందుకిలా చేశావని అడిగితే.. రైతు నిరసనలకు మద్దతుదారు అని చెప్పింది. నేను క్షేమంగానే ఉన్నాను. కాకపోతే పంజాబ్‌లో ఉగ్రవాదం, హింసను ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే ఆందోళనగా ఉంది’ అని కంగనా పేర్కొన్నారు. తాజాగా ‘ఆల్ ఐస్ ఆన్ రఫా గ్యాంగ్.. ఇది మీకు మీ పిల్లలకు కూడా జరగొచ్చు. ఒకరిపై జరిగిన దాడిని మీరు ఎంజాయ్ చేస్తే.. అదే ఘటన మీకూ ఎదురుకావొచ్చు. అలాంటి పరిస్థితికి సిద్ధంగా ఉండండి’అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు.
Aslo Read: USA vs PAK: పాక్‌కు షాకిచ్చిన యూఎస్ బౌలర్ మనోడే.. రాహుల్, మయాంక్‌లతో కలిసి ఆడాడు!
‘నా మీద ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటనపై మీరు మౌనంగా ఉండొచ్చు. కొందరు వేడుక చేసుకుంటూ ఉండొచ్చు. భవిష్యత్తులో మీరు భారత్‌లో అయినా లేదా విదేశాల్లో అయినా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే.. ఇజ్రాయెల్ లేకా పాలస్తీనాకు చెందిన వారు మీపై లేదా మీ పిల్లలపై దాడి చేయొచ్చు. ఇజ్రాయెల్ బందీల కోసమో లేదా రఫా కోసం మీ అభిప్రాయం తెలపనందుకు అలా జరగొచ్చు. అప్పుడు మీ వాక్ స్వాతంత్ర్యం హక్కుల కోసం నేను పోరాడుతున్నానని గుర్తిస్తారు. నేను మీలాగా కాదు’ అని కంగనా పేర్కొన్నారు. అయితే ఆ పోస్టును ఆమె కాసేపటికి డిలీట్ చేశారు. తనపై దాడి ఘటనపై ఇండస్ట్రీకి చెందిన వారు ఎవరూ స్పందించకపోవడంతోనే కంగనా ఆ పోస్ట్ పెట్టారని నెటిజెన్స్ అంటున్నారు.