BM Sandeep Kumar: తెలంగాణలో అందరూ కలిసికట్టుగా, ఐకమత్యంతో పనిచేయడం వల్లే గత ఎన్నికల్లో 64 ఎమ్మెల్యే సీట్లతో రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగామని, ఆ తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ (ఏఐసీసీ) వ్యవహారాల ఇన్ఛార్జ్ బీఎం సందీప్ కుమార్ తెలిపారు. గాంధీ భవన్లో జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను అమలు చేస్తోందని సందీప్ కుమార్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం వల్ల తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తగినంత సహాయ సహకారాలు అందించడం లేదని విమర్శించారు. కేంద్రం సహాయ నిరాకరణ చేస్తున్నప్పటికీ, రాష్ట్రంలోని కరువు పరిస్థితులను సమర్థవంతంగా అధిగమిస్తూ అన్ని రకాలుగా ప్రజల అవసరాలను తీరుస్తున్నామని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని చెప్పారు.
గతంలో ఇక్కడ పనిచేసిన ఏఐసీసీ ఇన్ఛార్జ్లు పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ఎస్ఐఆర్ (SIR)లో కాంగ్రెస్ పార్టీ పనితీరు దేశానికే స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ బలిదానాలు, సోనియా గాంధీ త్యాగాలు దేశ ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయని పేర్కొంటూ, సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్’ పుస్తకానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత లభించిందని తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా మరింత ఉత్సాహంతో కలిసికట్టుగా పనిచేసి, రాబోయే ఎన్నికల్లో మరింత ఎక్కువ మెజారిటీతో అధిక స్థానాలు గెలుచుకోవాలని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడంతో పాటు దేశంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడి పనిచేయాలని బీఎం సందీప్ కుమార్ కోరారు.

