NTV Telugu Site icon

Rajyasabha: ఖర్గే వ్యాఖ్యలపై దద్దరిల్లిన రాజ్యసభ.. 135 కోట్ల మంది నవ్వుతున్నారంటూ ఛైర్మన్ ఆగ్రహం

Rajyasabha

Rajyasabha

Rajyasabha: కేంద్రంలోని అధికార బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో రాజ్యసభ దద్దరిల్లింది. ఆయనవి అభ్యంతరకర వ్యాఖ్యలని, క్షమాపణ చెప్పాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేసింది. కానీ క్షమాపణ చెప్పేందుకు ఖర్గే ఖరాకండిగా ససేమిరా అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్‌ నేత క్షమాపణలు చెప్పాలంటూ భాజపా సభ్యులు నినాదాలు చేశారు.

ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రాజ్యసభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలపై రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ వారించినా వారు వినిపించుకోకపోవడంతో ధన్‌కర్ అసహనానికి గురయ్యారు. ‘‘సభలో ఇలాంటి ప్రవర్తన సభకు చాలా చెడ్డపేరు తెస్తుంది. సభ నడిచే తీరుతో బయట ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నారు. కనీసం సభాపతి సూచనలను కూడా పట్టించుకోవట్లేదు. ఎంతటి బాధాకర పరిస్థితిని సృష్టిస్తున్నాం. నమ్మండి.. మనల్ని చూసి 135 కోట్ల మంది ప్రజలు నవ్వుతున్నారు’’ అని అని రాజ్యసభ ఛైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్‌ జోడో యాత్ర’ను బీజేపీ నేతలు ‘భారత్‌ తోడో యాత్ర’గా పేర్కొనటంపై సోమవారం మల్లికార్జున్‌ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. దేశం కోసం కాంగ్రెస్‌ స్వాతంత్య్రాన్ని తీసుకొచ్చిందని, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ వంటి నేతలు దేశం కోసం ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ.. ‘కనీసం బీజేపీ నేతల ఇంట్లోని శునకం అయినా దేశం కోసం చనిపోయిందా? అయినప్పటికీ వారు దేశభక్తులమని చెప్పుకుంటున్నారు. మేమేమైనా అంటే దేశద్రోహులుగా ముద్ర వేస్తారు’ అంటూ మండిపడ్డారు.

Srinivas Goud: పక్క రాష్ట్రమైనా, సొంత రాష్ట్రమైనా.. నకిలీ మద్యం చేస్తే వదిలే ప్రసక్తే లేదు

ఖర్గే వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్రదుమారాన్ని రేపాయి. మంగళవారం పార్లమెంట్‌ మొదలవ్వగానే.. ఖర్గే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అధికార పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఖర్గే క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ డిమాండ్‌ చేశారు. అటు లోక్‌సభలోనూ బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.  ఇదిలా ఉండగా.. బీజేపీపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే సమర్థించుకున్నారు. పార్లమెంట్‌ వెలుపల చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చ జరగాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్‌ చేశాయి.