ఈరోజు ఎన్టీవీ నిర్వహించిన క్వశ్చన్ అవర్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎంతో సేవ చేశానని తెలిపారు. ఎన్నికల్లో ఎవరో చెబితో ప్రజలు ఓట్లు వేయరు.. వారికి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓటేస్తారన్నారు. అది ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి ఎంతో చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదని ఆరోపించారు. వారు కుర్చీ కోసం ఎన్నో అబద్ధాలు చెప్పారు.. ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. అప్పులున్నాయని తెలిసే హామీలు ఇచ్చారు కదా..? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు అన్నారు.
దేశ వ్యాప్తంగా మోడీ వేవ్ నడుస్తుందని.. ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లతో బీజేపీ గెలుస్తుందని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. ఇది దేశం కోసం జరుగుతున్న ఎన్నికలని అన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు.. యూపీ నుంచి రాహుల్ ఎందుకు పారిపోయారు..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలవదని వారికి తెలిసినట్లుంది.. అందుకే తీవ్ర తంటాలు పడుతుందని చెప్పారు. కాగా.. తెలంగాణలో ఈసారి 10-12 ఎంపీ సీట్లు గెలుస్తామన్నారు. మరోవైపు.. గతంలో కాంగ్రెస్ తనకు ఏం గౌరవం ఇవ్వలేదని చెప్పారు. బీజేపీ నుంచి పోటీ చేసి.. ఓడినా గెలిచినా తాను ప్రజల మధ్యే ఉన్నానన్నారు.
మరోవైపు.. సీఎం రేవంత్ రెడ్డికి పాలమూరుపై ప్రేమలేదని డీకే అరుణ ఆరోపించారు. సీఎం మాట్లాడే భాష సరిగా లేదు.. గడీలంటే ఏంటో కాంగ్రెస్ వాళ్లు చెప్పాలన్నారు. రాహుల్ ప్రధాని అయ్యేది లేదు.. ఆరు గ్యారెంటీలు ఇచ్చేది లేదని విమర్శించారు. బీజేపీలో తనకు ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై స్పందిస్తూ.. రాజకీయాల కోసం కవితను అరెస్ట్ చేయలేదన్నారు. అరెస్ట్ చేస్తే చేయలేదన్నారు.. చేస్తే రాజకీయం అంటున్నారని పేర్కొన్నారు.