ఇప్పటికే అత్యధిక రాష్ట్రాల్లో పాగా వేసిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏపీలో పార్టీ ఎదుగుదలకు బీజేపీ కేంద్ర నాయకత్వం కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే గతంలో కంటే భిన్నంగా మోడీ సర్కార్ ఏపీ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమిలో ఉంటూనే.. రాష్ట్రంలో సొంతంగా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పార్టీ పరంగా ప్రక్షాళన చేయడానికి సిద్దమైంది. బీజేపీ పార్టీకి కొత్త అధ్యక్షుడు నియామకంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఇటీవలి కాలంలో కేంద్రం నుంచి ఏపీకి వరుసగా సాయం అందుతోంది. ఆ నిర్ణయాలు ప్రజల్లో సానుకూలత పెంచుతుండగా.. ఈ సమయంలోనే పార్టీ బలోపేతం దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఏపీకి కేంద్రం నుంచి అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు అనుకూలంగా ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించింది. దీంతో బీజేపీ పైన గతం కంటే రాష్ట్ర ప్రజల్లో సానుకూలత పెరిగింది. వీటి అన్నిటిపై నోవాటేల్లో ఈరోజు ఉదయం 8 గంటలకు ఏపీ బీజేపీ నేతలతో కేంద్రహోంమంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించనున్నారు. అలానే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సరైన నాయకుడి కోసం కేంద్ర నాయకత్వం వెతుకుతోంది. ఏపీ ఇక బీజేపీకి కీలక అంశాలపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.