NTV Telugu Site icon

MLC Celebrations: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా విజయోత్సవ సంబరాలు

Mlc Celebrations

Mlc Celebrations

MLC Celebrations: కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట సంబరాలు వెల్లివిరిశాయి. ఈ కార్యక్రమంలో మల్క కొమురయ్యతో పాటు బీజేపీ రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Read Also: Obesity Causes: అతిగా తినడం మాత్రమే కాదు.. ఈ తప్పులు కూడా ఊబకాయానికి కారణాలే

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్ మాట్లాడుతూ.. మల్క కొమురయ్య గెలుపుతో రేవంత్ సర్కార్ పతనానికి నాంది పడ్డట్లు వ్యాఖ్యానించారు. 317 జీవోపై బీజేపీ అలుపెరగని పోరాటం చేసిందని గుర్తుచేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో మల్క కొమురయ్య మండలిలో వినిపిస్తారని అన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని, ఉపాధ్యాయుల ఆవేదన ప్రభుత్వానికి తీవ్ర ఝలక్ ఇస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందనడానికి నిదర్శనమని కే.లక్ష్మణ్ స్పష్టం చేశారు. బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, పార్టీపై ఎదురు దాడులు చేయడం తగదని అన్నారు. తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన వివరించారు.

Read Also: APPSC Jobs Age Limit: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. రిక్రూట్‌మెంట్‌ వయోపరిమితి పెంపు

ఇక ఎమ్మెల్సీ మల్క కొమురయ్య మాట్లాడుతూ.. తన విజయంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర, రాష్ట్ర పార్టీ నాయకత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో తనపై జరిగిన దుష్ప్రచారాలను తిప్పికొట్టిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు చెప్పారు. తనను కార్పొరేట్ అభ్యర్థిగా ప్రచారం చేశారని.. కానీ, తాను ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పూర్తి పట్టుదలతో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. 317 జీవో చాలా దుర్మార్గమైనదని, దానిపై తమ పోరాటం కొనసాగుతుందని మల్క కొమురయ్య హామీ ఇచ్చారు. విద్యాశాఖలో అనేక సమస్యలు ఉన్నాయని, ఉపాధ్యాయులు సతమతమవుతున్నారని, దానితో పిల్లలకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడూ అండగా ఉంటానని ఆయన అన్నారు. వీలైనంతవరకు ఉపాధ్యాయులతోనే ఉంటానని మల్క కొమురయ్య తెలిపారు.