Graduate MLC Elections: తెలంగాణలో నిర్వహించిన కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ (Graduate MLC Elections) ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి (Anji Reddy) భారీ విజయం సాధించారు. మూడు రోజుల పాటు నిర్విరామంగా జరిగిన ఓట్ల లెక్కింపులో రెండో ప్రాధాన్యత ఓట్ల (Second Preference Votes) ఆధారంగా అంజిరెడ్డి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో నిలిచారు. ఓట్ల లెక్కింపు సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.
ఇక కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీకి గెలుపు లభించింది. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య (Malka Komuraiah) విజయం సాధించారు. ఉపాధ్యాయ కోటాలో మొత్తం 25,041 ఓట్లు ఉండగా, అందులో 897 ఓట్లు చెల్లనివిగా తేలాయి. చెల్లుబాటైన 24,144 ఓట్లలో మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు దక్కాయి. పీఆర్‌టీయూ అభ్యర్థి మహేందర్ రెడ్డి (Mahender Reddy) 7,182 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో అశోక్ కుమార్ (Ashok Kumar) 2,621 ఓట్లను పొందారు. ఇక రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచిన బీజేపీ మరింత ఉత్సాహంతో కనపడుతోంది. ఉపాధ్యాయ కోటా, పట్టభద్రుల కోటా రెండు చోట్లా కాషాయ జెండా ఎగరడంతో బీజేపీ శ్రేణుల్లో సంతోషం నెలకొంది.