NTV Telugu Site icon

CM Revanth Reddy: రాష్ట్రాన్ని 1 ట్రిలియన్‌ ఎకానమీగా మార్చాలనేదే ప్రభుత్వ లక్ష్యం!

Revanth Reddy Speech

Revanth Reddy Speech

రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని 1 ట్రిలియన్‌ ఎకానమీగా మార్చాలనేదే ప్రభుత్వ లక్ష్యం అని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. భారత్‌లోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ వాహనాల కేంద్రంగా హైదరాబాద్‌ మారిందన్నారు. హైదరాబాద్‌లో ఫ్యూచర్‌ సిటీ, ఏఐ సిటీతో పాటు ఎన్నో భారీ ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. దేశంలోనే ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించే రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో మిగతా రాష్ట్రాల కంటే మనం ముందున్నాం అని.. హైదరాబాద్‌కు వచ్చే కంపెనీల ద్వారా 5 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం చెప్పారు. హైదరాబాద్‌ వేదికగా బయో ఆసియా సదస్సు 2025 జరుగుతోంది. ఈ సదస్సును సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు.

బయో ఆసియా సదస్సు 2025లో సీఎం రేవంత్‌ మాట్లాడుతూ… ‘గ్లోబల్‌ లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌గా హైదరాబాద్‌ మారింది. హెల్త్ కేర్ రంగం భవిష్యత్తును నిర్దేశించటంతో పాటు ప్రపంచానికి మార్గదర్శనం చేసే కార్యక్రమంగా బయో ఏషియా దేశ విదేశాలను ఆకర్షిస్తోంది. ప్రపంచంలో పేరొందిన ఫార్మా కంపెనీలు, హెల్త్‌కేర్, లైఫ్ సైన్స్ మరియు బయోటెక్ కంపెనీలెన్నో హైదరాబాద్ నుంచి పని చేస్తున్నాయి. ముందునుంచీ పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను అందించే సంస్థలను ప్రోత్సహించాలనే దార్శనికతతో మా ప్రభుత్వం పని చేస్తోంది. మేం ఇంతకాలం ఉన్నత విద్యపై పెట్టుబడులు పెట్టాం. ఎందరో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఆయా రంగాల్లో శాస్త్ర నిపుణులు, ఇంజనీర్ల సమూహాన్నీ తయారు చేశాం. జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని అన్నారు.

‘హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీ ఏరియా సేవల రంగానికి ప్రాధాన్యమిస్తాం. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీతో పాటు ఎన్నో భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాం. ఇప్పుడు దేశంలో హైదరాబాద్ ఎలక్ట్రిక్ వాహనాల రాజధానిగా అవతరించింది. దేశంలోనే అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఇక్కడ జరుగుతున్నాయి. 3,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెడుతున్నాం. కోర్ సిటీ వెలుపల అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మాన్యుఫాక్షరింగ్ హబ్ అభివృద్ధి చేస్తాం. ప్రపంచంలోని అతిపెద్ద తయారీ కేంద్రాలలో ఒకటిగా దీన్ని నెలకొల్పుతాం. చైనా ప్లస్ వన్ అవసరాలు తీర్చే కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేస్తాం. ప్రపంచం నలుమూలాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తాం. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్.. ఈ రెండు రింగ్‌లను రేడియల్ రోడ్లతో అనుసంధానిస్తాం. ఈ రహదారులకు ఇరువైపులా క్లస్టర్లను అభివృద్ధి చేస్తాం. తెలంగాణ భూ పరివేష్టిత రాష్ట్రం. ఒక మెగా డ్రై పోర్టును అభివృద్ధి చేసి.. ఇక్కడి నుంచి ఏపీలోని సీ పోర్ట్కు అనుసంధానం ఉండేలా ప్రత్యేక రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు మెరుగుపరుస్తాం’ అని సీఎం చెప్పారు.

‘బయోసైన్సెస్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నాం. ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి, తయారీ, నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో పని చేస్తున్నాం. నిన్ననే హైదరాబాద్‌లో అమెజాన్ సంస్థ తమ కార్యకలాపాలను విస్తరించింది. ఇది మా సహకారానికి నిదర్శనం. తెలంగాణలో ఉన్న అనుకూలతలు, మా ప్రభుత్వ సహకారాన్ని అందుకోవాలని, మాతో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రపంచస్థాయి దిగ్గజ కంపనీలన్నింటినీ ఆహ్వానిస్తున్నాం. సులభమైన పారిశ్రామిక విధానం, మౌలిక సదుపాయాలు, ఆశించినంత మద్దతు అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో భారతదేశంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇక్కడ అత్యల్ప ద్రవ్యోల్బణం, అత్యధిక ఉద్యోగాల కల్పన ఉంది. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో తెలంగాణ రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. విభిన్న రంగాలలో దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నాయి. గత ఏడాది లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.40,000 కోట్లకు పైగా పెట్టుబడులను విజయవంతంగా ఆకర్షించాము. దాదాపు 150పైగా ప్రాజెక్టుల్లో ఈ పెట్టుబడులు విస్తరించాయి’ అని సీఎం పేర్కొన్నారు.

‘ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఫార్మా గ్రామాలు అభివృద్ధి చేస్తున్నాం. ఐదు లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించాలని మేము ఆశిస్తున్నాము. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ కింద కీలకమైన చొరవ అయిన గ్రీన్ ఫార్మా సిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలు అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి. జర్మన్ కంపెనీ మిల్టెని బయోటెక్ జీనోమ్ వ్యాలీలో తన సెల్ మరియు జన్యు చికిత్సను ప్రారంభించింది. ఈ వేదికపై మరో నాలుగు బహుళజాతి కంపెనీలను మా పర్యావరణ వ్యవస్థలోకి స్వాగతిస్తున్నాము. గత 25 సంవత్సరాలలో హైదరాబాద్ ఫార్మా తయారీ, ఐటీ, డిజిటల్ హెల్త్‌ పవర్‌ హౌస్‌గా పేరు నిలుపుకుంది. గత ఏడాది ఏఐ హెల్త్‌కేర్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించాము. దేశవిదేశాల నుంచి బయో ఏషియా సదస్సుకు హాజరైన ప్రముఖులు గొప్ప మనసున్న వారందరికీ అభినందనలు. మీరందరూ తెలంగాణను అనువైన వేదికగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును పొందిన ప్రొఫెసర్ పాట్రిక్ టాన్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నా’ అని సీఎం రేవంత్‌ చెప్పుకొచ్చారు.