Site icon NTV Telugu

Bihar Election 2025: ఓటింగ్‌కి ముందే ఓటమి – బీహార్ ఎన్నికల్లో అస్త్ర సన్యాసం చేసిన ముగ్గురు!

Bihar Election 2025

Bihar Election 2025

Bihar Election 2025: దేశ వ్యాప్తంగా ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ, ఊహించని సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. నామినేషన్ల పరిశీలన తర్వాత, మూడు అసెంబ్లీ స్థానాల్లో అకస్మాత్తుగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ స్థానాల్లో రెండు మహా కూటమికి చెందినవి కాగా, ఒకటి NDAకి చెందింది. వాస్తవానికి ఈ మూడు స్థానాల్లో ముగ్గురికి ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ అసెంబ్లీ స్థానాలు ఏంటో తెలుసా.. మోహానియా, సుగౌలి, మధుర అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు ఎన్నికల సంఘం అధికారులు తిరస్కరించారు. ఈ లెక్కన చూస్తే ఈ స్థానాల్లో పోటీలో నిలుచున్న అభ్యర్థులు పోటీకి ముందే అస్త్ర సన్యాసం చేశారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

READ ALSO: Checkposts Close: రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ చెక్‌పోస్టుల మూసివేత

మోహానియాలో ఆర్జేడీ అభ్యర్థి శ్వేతా సుమన్ నామినేషన్ రద్దు..
ఈ ఎన్నికల్లో మోహానియా అసెంబ్లీ స్థానం అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఆర్జేడీ పార్టీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి శ్వేతా సుమన్ నామినేషన్‌ను అధికారులు రద్దు చేశారు. ఎన్నికల కమిషన్ దర్యాప్తులో శ్వేతా సుమన్ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మోహానియా నుంచి నామినేషన్ దాఖలు చేశారని, కానీ ఆమె చిరునామాను ఉత్తరప్రదేశ్‌లోని చందౌలి జిల్లాలోని సకల్దిహా అసెంబ్లీ నియోజకవర్గంగా పేర్కొన్నారని తేలింది. ఈసారి పోటీలో భాగంగా శ్వేతా సుమన్ బీహార్ ఆమె చిరునామాగా పేర్కొన్నారు. కానీ తగిన ఆధారాలు లేకుండా ఆమె వాదనను అంగీకరించడానికి ఎన్నికల కమిషన్ నిరాకరించింది. శ్వేతా సుమన్ ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ స్థానికురాలిగా పరిగణించబడుతున్నారని కమిషన్ తీర్పు ఇచ్చింది. తద్వారా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమె నామినేషన్ చెల్లదని స్పష్టం చేసింది. గత ఎన్నికల్లో మోహానియా స్థానంలో పార్టీ బలమైన ఉనికిని కలిగి పార్టీగా నిలిచిన ఆర్జేడీకి ఈ నిర్ణయం పెద్ద దెబ్బగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నిర్ణయం తర్వాత ఆర్జేడీ కొత్త వ్యూహరచన చేయాల్సి ఉంటుందని పేర్కన్నారు.

సుగౌలి స్థానంలో వీఐపీ అభ్యర్థి..
తూర్పు చంపారన్‌లోని సుపాల్ అసెంబ్లీ స్థానంలో కూడా మహా కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. సాంకేతిక లోపాల కారణంగా వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) అభ్యర్థి శశి భూషణ్ సింగ్ నామినేషన్ తిరస్కరించబడింది. పలు నివేదికల ప్రకారం.. నామినేషన్ ఫారంలోని కొన్ని ముఖ్యమైన పత్రాలు అసంపూర్ణంగా ఉన్నాయని, కమిషన్ వెరిఫికేషన్ సమయంలో అనేక వ్యత్యాసాలు బయటపడ్డాయని అధికారులు తెలిపారు. దర్యాప్తు తర్వాత రిటర్నింగ్ అధికారి శశి భూషణ్ సింగ్ నామినేషన్ చెల్లదని ప్రకటించారు. ఈ పరిణామం వీఐపీ పార్టీని మాత్రమే కాకుండా మొత్తం మహా కూటమిని ప్రభావితం చేసింది. సుపాల్ స్థానంలో మహా కూటమితో ఎన్డీఏ ప్రత్యక్ష పోటీని ఎదుర్కోవాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కూటమి అభ్యర్థి నామినేషన్ చెల్లుబాటు కాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.

మధుర సీటులో ఎన్డీఏ అభ్యర్థి ..
చాప్రా జిల్లాలోని మధుర అసెంబ్లీ స్థానంలో ఎన్డీయేకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అభ్యర్థి సీమా సింగ్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. పలు నివేదికల ప్రకారం.. ఆమె నామినేషన్ పత్రాలలో ఆదాయపు పన్ను, ఆస్తి సంబంధిత పత్రాలలో తీవ్రమైన తప్పులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. వెరిఫికేషన్ సమయంలో ఈ వ్యత్యాసాలు బయటపడ్డాయి, దీంతో ఎన్నికల అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. నామినేషన్ గడువు ముగిసిన క్రమంలో ఎల్జేపీ (రామ్ విలాస్) ఈ స్థానానికి కొత్త అభ్యర్థిని నిలబెట్టలేక పోయింది. దీంతో పోటీ లేకుండానే ఈ స్థానంలో ఎన్డీఏ కూటమి ఓటమి మూటగట్టుకున్నట్లు అయ్యింది.

బీహార్ ఎన్నికల పోరులో ఈ మూడు స్థానాల్లో నామినేషన్ల రద్దు కొత్త మలుపు తెచ్చింది. మొహానియా, సుగౌలిలలో వాస్తవానికి మహా కూటమి ఓడిపోయింది. అలాగే మధురలో NDA ఓడిపోయింది. ఓటమి మూటగట్టుకున్న సీట్ల కోసం ఆర్జేడీ, వీఐపీ, ఎల్జేపీ (రామ్ విలాస్) ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తాయో చూడటం ఆసక్తికరంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇస్తాయా లేదా కూటమిలో సీట్ల సర్దుబాటు కోసం కొత్త ఫార్ములాను తీసుకొస్తాయో చూడాలి. ప్రస్తుతానికి 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ చేయకుండానే పరాజయం పాలై అస్త్ర సన్యాసం చేశారని విశ్లేషకులు చెబుతున్నారు.

READ ALSO: Dude: డ్యూడ్’కి ఇళయరాజా మార్క్ షాక్

Exit mobile version