Site icon NTV Telugu

Bihar: బలపరీక్షలో నితీష్ కుమార్ సర్కార్ విజయం

Nir

Nir

బీహార్ అసెంబ్లీలో (Bihar Assembly) జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ (Nitish Kumar) సర్కార్ విజయం సాధించింది. అసెంబ్లీలో జరిగిన ఫ్లోర్ టెస్ట్‌లో సీఎం నితీశ్ కుమార్‌కు 129 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. దీంతో ఆయన బలపరీక్షలో సునాయసంగా గట్టెక్కేశారు. మరోవైపు అసెంబ్లీ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.

అంతకముందు ఆర్జేడీకి మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్‌లో ఉంచారు. జేడీయూకు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు నితీష్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తారేమోనని ప్రచారం జరిగింది. కానీ మొత్తానికి నితీష్ కుమార్ ఫ్లోర్ టెస్ట్‌లో నెగ్గారు. ఇటీవలే ఆయన ఎన్డీఏ కూటమిలో చేరారు. బీజేపీ ఎమ్మెల్యేలంతా నితీష్‌కు మద్దతుగా నిలవడంతో బలపరీక్షలో విక్టరీ సాధించారు.

బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్‌కి 122 సీట్లు ఉండాలి. నితీష్ వర్గం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో సభలో ఉన్న 129 మంది ఎమ్మెల్యేలంతా నితీష్‌కు మద్దతుగా ఓటు వేశారు. దీంతో అవిశ్వాస తీర్మానంలో నితీష్ సర్కార్ సునాయసంగా గట్టెక్కేసింది.

ఇటీవలే ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాకూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చి ఎన్డీఏతో జతకట్టింది. ముఖ్యమంత్రి పదవికి నితీష్ రాజీనామా చేసిన రోజే.. కొన్ని గంటల్లో బీజేపీ మద్దతుతో నితీష్‌కుమార్ తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి హిస్టరీ సాధించారు. సోమవారం జరిగిన బలపరీక్షలో కూడా ఆయన విజయం సాధించారు.

Exit mobile version