Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!

Bcci

Bcci

Bhuvneshwar Kumar Team India Return: భువనేశ్వర్ కుమార్‌ను టీమ్‌ఇండియా సెలెక్టర్లు మళ్లీ టీ20 టీమ్‌లోకి తీసుకోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఈ నిర్ణయం వెనుక సెలెక్టర్ల స్పష్టమైన ప్లాన్ ఉందనే వార్తలు వస్తున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాలో జరగనున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ బౌలింగ్ లైనప్‌పై సెలెక్టర్లకు అంతగా నమ్మకం కుదరడం లేదని తెలుస్తోంది. అందుకే భువీ గనుక తన ఫిట్‌నెస్‌ను సరిగ్గా నిరూపించుకుంటే, రాబోయే మెగా టోర్నీలో జస్ప్రీత్ బుమ్రాతో కలసి అతను ప్రధాన బౌలర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ పూర్తి స్థాయిలో సమర్థించారు. “ఆలస్యమైనా ఇది మంచి నిర్ణయం, భువనేశ్వర్ ఈ అవకాశానికి పూర్తి అర్హుడు. అతన్ని ఎంపిక చేసి ఎవరూ ఉచితంగా మేలు చేయలేదు” అని తన యూట్యూబ్ ఛానెల్‌లో వ్యాఖ్యానించారు. ఐపీఎల్‌లోనూ, ఉత్తరప్రదేశ్ తరఫున డొమెస్టిక్ క్రికెట్‌లోనూ భువీ వరుసగా ప్రతిభ చూపుతున్నాడని, ఫిట్‌నెస్‌ కూడా బాగున్నప్పుడు అసలు ఇన్నాళ్లూ ఎందుకు పక్కన పెట్టారో అర్థం కాలేదని అన్నారు. ప్రదర్శన బాగున్నప్పుడు వయసును వంకగా చూపించకూడదని, జట్టులో ఒత్తిడిని తట్టుకోవాలంటే కేవలం యంగ్‌స్టర్స్ మాత్రమే సరిపోరని, అనుభవం ఉన్న సీనియర్ల అవసరం ఖచ్చితంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

అలాగే, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ వంటి సీనియర్ బౌలర్లను సరిగ్గా వాడుకోకపోవడంపై కూడా జాఫర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం సెలెక్టర్లు గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, నితీష్ రెడ్డి లాంటి యువ ఆటగాళ్లను వన్డేల్లో ప్రయత్నిస్తున్నప్పటికీ, వారిపై మేనేజ్‌మెంట్‌కు ఇంకా పూర్తి నమ్మకం రాలేదని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో సిరాజ్‌కు క్రమం తప్పకుండా మ్యాచ్‌లు ఆడించే అవకాశం ఇవ్వకపోవడం, షమీని పక్కన పెట్టడం సరికాదన్నారు. రాబోయే వరల్డ్ కప్ నాటికి మన జట్టులో రెండో, మూడో ప్రధాన వేగవంతమైన బౌలర్లు ఎవరో కూడా స్పష్టత లేకుండా పోయిందని ప్రశ్నించారు. తానికైతే బుమ్రా, షమీ, సిరాజ్‌లనే మొదటి ప్రాధాన్యతగా ఎంచుకుంటానని, కొత్త టీమ్‌ను పునర్నిర్మించే ఆలోచన ఏమైనా ఉంటే అది వరల్డ్ కప్ పూర్తయ్యాకే చూసుకోవచ్చని హితవు పలికారు. ముఖ్యంగా టెస్టూ, వన్డే మ్యాచ్‌ల్లో షమీ కమ్‌బ్యాక్ ఇవ్వడం చాలా ముఖ్యమని జాఫర్ గుర్తుచేశారు. త్వరలో ప్రకటించబోయే జట్టులో షమీతో పాటు ఔకిబ్ నబీ పేర్లు ఉంటాయేమోనని తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ ఈసారి కూడా షమీని గనుక సెలెక్టర్లు పక్కన పెడితే, ఇక అతని జాతీయ జట్టు కెరీర్ ముగిసినట్లేనని వసీం జాఫర్ అభిప్రాయపడ్డారు.