Gollabuddharam Murder Case: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం గ్రామ తండాలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. అక్రమ సంబంధం నేపథ్యంలో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. భార్య, ఆమె ప్రియుడు పరారీలో ఉండగా.. పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భూపాలపల్లి సీఐ శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. అజ్మీర చందు (30)ను అతడి భార్య పావని, ఆమె ప్రియుడు సంతోష్ కలిసి ఇంట్లోనే హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఎడ్లబండిపై తరలించి.. చికెన్‌పల్లి సమీపంలో రోడ్డు పక్కన పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ సంపత్ రావు, సీఐలు అక్కడి పరిస్థితులను పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు పావని, సంతోష్ పరారీలో ఉన్నారు.

