NTV Telugu Site icon

Bhumireddy Ramgopal Reddy: పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విక్టరీ

Ramgopal

Ramgopal

తీవ్ర ఉత్కంఠ నడుమ పశ్చిమ రాయలసీమ (కడప – అనంతపురము – కర్నూలు) ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి (Bhumireddy Ramgopal Reddy) ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డిపై 7543 ఓట్ల తేడాతో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలుపొందారు. దీంతో ఏపీలో జరిగిన మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. అనంతపురములోని జేఎన్టీయూ కళాశాలలో పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గం (కడప – అనంతపురము – కర్నూలు) ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా గురువారం ఉదయం 08:00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టగా, శనివారం రాత్రి 08:00 గంటల వరకు నిర్వహించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి సరైన మెజార్టీ దక్కకపోగా, అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి 7543 ఓట్ల తేడాతో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలిచినట్లుగా రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ప్రకటించారు. ఈ కౌంటింగ్ లో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి 1,09,781 ఓట్లు రాగా, వెన్నపూస రవీంద్ర రెడ్డికి 1,02,238 ఓట్లు వచ్చాయని తెలిపారు.

కౌంటింగ్ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రథమ ప్రాధాన్యత ఓట్ల ద్వారా కాకుండా ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించారు. దీంతో తెలుగుదేశం పార్టీ అభిమానులు పులివెందులలో కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. కౌంటింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. కొన్ని ఓట్ల బండిల్స్ టీడీపీకి వేశారని ఆరోపించారు. రీ కౌంటింగ్‌కు పట్టుబట్టారు. పలుమార్లు కౌంటింగ్ సెంటర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వెళ్ళిన వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డి బయటకు వెళ్లి పార్టీ నేతలతో మాట్లాడి వచ్చారు.

Read Also: Blood Donation : రక్తదానం చేయడానికి వారు అర్హులు కాదు.. ఎందుకో తెలుసా?

అయితే ద్వితీయ ప్రాధాన్య ఓట్లు చాలా ఎక్కువగా టీడీపీకి రావడం.. మెజార్టీ ఏడు వేలు దాటిపోవడంతో.. రీకౌంటింగ్ విషయంలోనూ అధికారులు వైసీపీ డిమాండ్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకోలేదు. ఓట్ల తారుమారును ఎన్నికల అధికారులు తేలిగ్గా తీసుకున్నారు.. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రీకౌంటింగ్ చేయాలి.. వైఎస్సార్ సీపీకి చెందిన ఓట్లను టీడీపీ ఖాతాలో ఎలా వేస్తారు? ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదు?..దీనిపై న్యాయపోరాటం చేస్తాం అన్నారు మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి. జగన్ అడ్డాలో టీడీపీ జెండా ఎగురేయడం టీడీపీ నేతలకు, కార్యకర్తలకు బూస్ట్ ఇవ్వగా.. వైసీపీ నేతలకు మాత్రం ఇబ్బందికరంగా మారింది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కలిపి టీడీపీకి గత ఎన్నికల్లో రెండు అంటే రెండు అసెంబ్లీ సీట్లు (ఉరవకొండ, హిందూపురం) వచ్చాయి. కడప, కర్నూలులో ఒక్కటీ రాలేదు. రాయలసీమ అంటే జగన్ అడ్డాగా భావించేవారికి తూర్పు, పశ్చిమ రాయలసీమ, అటు ఉత్తరాంధ్రలోనూ సైకిల్ జోరు మీద ఉండడం వైసీపీ నేతలకు మింగుడుపడడం లేదు. తాజా విజయంతో చంద్రబాబునాయుడు, లోకేష్ ఖుషీగా ఉన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు వారు శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: NEET: ఏడాదికి రెండుసార్లు నీట్ ఎగ్జామ్.. కేంద్రం మంత్రి క్లారిటీ..

Show comments